సోషల్ మీడియా మోసాలు ఈమధ్య ఎక్కువైపోయాయి. ప్రేమ పేరుతో సోషల్ మీడియాలో చాటింగ్, కాల్స్ చేయడం తర్వాత వారిని మోసం చేయడం లాంటివి పెరిగాయి. ఇలాంటి మోసాల్లో అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడాలు ఉండట్లేదు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అమాయకులకు వలపు వేసి మోసం చేస్తున్న ఘటనల గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఓ ఘటనే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి మోసం చేశాడో యువకుడు. ఈ ఘటనలో నిందితుడి మీద బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
సౌత్ ఢిల్లీలో నివసించే 29 ఏళ్ల ఓ యువతి ఏడేళ్లుగా భర్తకు దూరంగా తొమ్మిదేళ్ల కొడుకుతో ఉంటోంది. నెల రోజుల కింద జీడిమెట్లకు చెందిన ఫయాజుద్దీన్ అఫ్రిది (24) అనే యువకుడితో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. డ్యాన్స్ మాస్టర్‌గా పని చేస్తున్న ఆ యువతిని ప్రేమిస్తున్నాంటూ అఫ్రిది దగ్గరయ్యాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. హైదరాబాద్‌కు రావాలని విమాన టికెట్లు బుక్ చేశాడు. అతడి మాటలు నమ్మిన యువతి ఆదివారం నగరానికి వచ్చింది. యువతిని పికప్ చేసుకున్న యువకుడు ఆమెతో ఓయో రూమ్‌లో కలసి ఉన్నాడు. సోమవారం ఉదయం టీ తాగి వస్తానని యువతికి చెప్పి బయటకు వెళ్లి.. అటు నుంచి అటే పరారయ్యాడు.
కొద్దిసేపయ్యాక కిందకు వచ్చిన యువతి.. అఫ్రిది కోసం చూడగా కనిపించకపోవడంతో ఫోన్‌కు కాల్ చేసింది. మొబైల్ స్విచ్చాఫ్ రావడంతో స్థానికంగా గాలించింది. అయినా ఫలితం లేకపోవడంతో సోమవారం వరకు వేచి చూసింది. తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఆమె కంప్లయింట్ చేసింది. నిందితుడి మీద అత్యాచారం, నమ్మకద్రోహం సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మొబైల్ నంబర్ ఆధారంగా నిందితుడిన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి, సోషల్ మీడియా ద్వారా మోసపోతున్న ఘటనలు ఎక్కువవడం మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.