కొంతమంది సరదా కోసం చేసే పనుల వల్ల చివరికి ఊహించని ప్రమాదాలకు గురవుతుంటారు. మరీ ముఖ్యంగా కొంతమంది యువతి యువకులు సెల్ఫీల కోసం, రీల్స్ కోసమని ఎంతకైనా తెగిస్తూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ యువకుడు సరదా కోసమని పెద్ద బండ ఎక్కాడు. ఆ తర్వాత అటు ఇటు చూస్తున్న క్రమంలోనే అదుపుతప్పి ఆ యువకుడు ఆ బండరాళ్ల మధ్యలో పడిపోయాడు. దీంతో ఆ యువకుడు బయటకు వచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో అతడు బయటకు రాలేకపోయాడు. అయితే అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన రాజు (26) అనే యువకుడు బతుకు దెరువుకోసమని హైదరాబాద్ కు వచ్చాడు. ఇతడు స్థానికంగా పనులు చేస్తూ నగరంలోని తిరుమలగిరిలో నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం రాజు సరదా కోసమని కాస్త బయటకు వెళ్లాడు. కెన్ కాలేజ్ పరిధిలో ఉన్న ఓ ఖాళీ ప్రదేశంలోకి వెళ్లాడు. ఇక అక్కడున్న ఓ బండపై ఎక్కి అక్కడున్న ప్రదేశాలను తిలకిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ యువకుడు అదుపు తప్పి ఆ బండరాళ్ల మధ్యలో ఇరుక్కుపోయాడు.
దీంతో వెంటనే అతడు తనంతట తాను పైకి ఎక్కేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ, ఎంత ప్రయత్నించినా అతడు బయటకు రాలేకపోయాడు. దీనిని గమనించిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 3 గంటల పాటు నరకం అనుభవించిన ఆ యువకుడిని పోలీసులు ఎట్టకేలకు సురక్షితంగా కాపాడారు. ఆ తర్వాత ఆ యువకుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స అనంతరం ఆ యువకుడిని పోలీసులు అతడిని స్వగ్రామానికి పంపించారు. అయితే ఈ ఘటనలో శ్రమించి రాజుని కాపాడిన పోలీసులను అధికారులు అభినందించారు.