నిండుగర్భిణి నడిరోడ్డుపై ప్రసవించిన సంఘటన అశోక్‌నగర్ కూడలి వద్ద చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన బబిత (గర్భిణి) సంచార జీవనం సాగిస్తూ ఇస్నాపూర్‌లోని మహేశ్వర మెడికల్ కాలేజ్ దగ్గరలో నివాసముంటోంది. ఆ మహిళ శనివారం మధ్యాహ్నం రామచంద్రాపురం, అశోక్‌నగర్ కూడలి వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా పురిటి నొప్పులు రావడంతో రకయాతన అనుభవించింది. ఉన్నట్టుండి రోదిస్తూ రోడ్డుపైనే కూర్చుండిపోయింది. అటువైపు వెళుతున్న వాహనదారులు, పాదాచారులు ఆమె పరిస్థితిని చూసి కూడా.. చూసి చూడనట్లు వెళ్లిపోయారు.
కాసేపటి తరువాత పురిటి నొప్పులతో విలవిల్లాడుతున్న ఆమెను గమనించిన స్థానిక మహిళలు.. సమీపంలో ఉన్న దుకాణాల నుంచి అట్టముక్కలు తెచ్చి అడ్డుగా పెట్టి ప్రసవం చేశారు. రోడ్డుపైనే ఆ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె దయనీయ స్థితిని చూసి చలించిన ఓ వ్యక్తి కొంతమేర ఆర్థిక సాయం చేశారు. ఆ తర్వాత ఆమెను ఆటోలో పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. మానవత్వంతో స్పందించి వారికి పూర్తి సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఆర్థిక సహాయం అందించిన ఆ వ్యక్తిని స్థానికులు అభినందించారు.