మూడేళ్ళ పాపకు అన్ని అవయవాలు సరిగానే ఉన్నా.. లేచి నడవలేని పరిస్థితి. కాళ్ళు కూడా కదపలేని స్థితి ఆ చిన్నారిది. దీంతో పూర్తిగా మంచానికే పరిమితమైంది ఆ పాప. వైద్యులకు చూపిస్తే.. వెన్నెముక కండరాలకు సంబంధించిన ‘‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ’ అనే అరుదైన వ్యాధితో పాప బాధపడుతుందని చెప్పారు. అయితే ఈ వ్యాధికి చికిత్స ఉందని, ఒక ఇంజక్షన్ చేస్తే నయమవుతుందని డాక్టర్లు చెప్పారు. అయితే ఆ ఇంజక్షన్ ఖరీదు రూ. 18 కోట్లు అని చెప్పడంతో పాప తల్లిదండ్రులకి ఏమీ అర్థం కాలేదు. మెదక్ జిల్లా, హవేళిఘనపూర్ మండలం వాడి తండాకు చెందిన మాలోత్ లక్ష్మణ్, రేఖ దంపతుల మూడేళ్ళ పాప ఈ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పుట్టి ఏడాది గడిచినా పాప కాళ్ళు ఆడించకపోయేసరికి డాక్టర్ ని కలిశారు. కొన్ని మందులు కూడా వాడారు.
అయినా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు చేసిన వైద్యులు.. పాప ‘‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ఇంజక్షన్ చేస్తే బతుకుతుందని చెప్పడంతో ఆ పేద ప్రాణాలు సంతోషించాయి. అయితే దాని ఖరీదు రూ. 18 కోట్లు అని చెప్పడంతో ప్రాణం పోయినట్టు అయిపోయింది. కూలి పని చేసుకుంటూ బతకడం తప్ప వేరే ఏ ఆధారం లేదు. ఇప్పటి వరకూ పాప చికిత్స కోసం ఉన్నదంతా అమ్మేసినట్లు పాప తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక తమకు దాతలే దిక్కు అంటూ కన్నీరు మునీరవుతున్నారు. పాప పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుందని.. ఎవరైనా నాయకులు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద మనసు చేసుకుని సాయం చేయాలని చిన్నారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
సాయం చేయాలనుకునే దాతలు 90591 68136, 80960 72981 నంబర్లకు కాల్ చేసి సంప్రదించవచ్చు. తోచినంత ఆర్ధిక సాయంతో పాపకు చికిత్స అందేలా మీ వంతు తోడ్పాటును అందించండి. పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేయలేకపోయినా.. ఈ విషయాన్ని మీరు షేర్ చేయడం ద్వారా మీలాంటి వారు సాయం చేసే అవకాశం ఉంటుంది. అందరూ కలిసి తోచినంత సాయం చేస్తే.. ఆ పాప లేచి చురుగ్గా పరుగులు పెడుతుంది. రేపు ఆ పాప గొప్ప స్థాయికి వెళ్తే.. దాని వెనుక మీరు అందించిన ప్రోత్సాహం కూడా ఉంటుంది. మీరు గర్వపడచ్చు కూడా. మరి ఈ పాప కోసం మీరేం చేయగలరో చేయండి. మీలోనూ భగవంతుడు ఉన్నాడని నిరూపించుకునే అవకాశం ఇదే.