‘కన్నబిడ్డకు పట్టెడన్నం పెట్టలేకపోతున్నా.. నేను బతికుంటానో లేదో కూడా తెలీదు.. నా భర్త తాగుబోతు.. నా బిడ్డకు మీరే దిక్కు’ ఓ అభ్యాగ్యురాలు పోలీసులను ఆశ్రయించి చెప్పిన మాటలు ఇవి. ‘బిడ్డను సాకేందుకు భిక్షాటన చేస్తున్నా. ఆ డబ్బును కూడా తన భర్త కొట్టి లాక్కుళ్లి పోయాడు’.. జగిత్యాల పోలీస్‌స్టేషన్‌లో పోలీసులను ఆశ్రయించి ఆమె తన గోడు వెళ్లబుచ్చుకుంది. స్పందించిన పోలీసులు వెంటనే ఆమెకు భోజనం పెట్టించారు. ఆమె ఆరోగ్యం సిరిగా లేదని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌస్ లో తల్లిని తలుచుకుని కన్నీటిపర్యంతం అయిన షణ్ముఖ్..
వివరాల్లోకెళితే.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన కస్తూరి మహేశ్వరి అనే మహిళకు వెంకటేశ్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. వారికి ఏడాదిన్నర పాప ఉంది. భర్త తాగుబోతు కావడంతో కుటుంబలో నిత్యం గొడవలు జరిగేవి. ఆమె ఓ కుల సంఘానికి చెందిన భవనంలో ఆశ్రయం పొందుతోంది. కూతురిని పోషించేందుకు భిక్షాటన చేస్తోంది. ఇటీవల భర్త వచ్చి ఆమెను కొట్టి ఆ డబ్బు లాక్కెళ్లాడు. ఆమె ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడంతో ఇంక నాకు మీరే దిక్కు అంటూ వెళ్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సఖి సెంటర్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి హరీశ్ ఆ మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి.. ఆమెను సఖి సెంటర్‌కు తరలించారు.