ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగ ఉన్నవారు సైతం హఠాత్తుగా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తరలించే పోపు మద్యలోనే కన్నుమూస్తున్నారు. ప్రస్తుతం గుండెపోటు పేరు వింటేనే గుండెల్లో దడ పుడుతుంది. నిన్న మెదక్ జిల్లాలో ఉపాధి కూలీ పనుల కోసం వెళ్లిన నాగరాజు అనే వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన మరువక ముందే మధిరకు చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో కన్నుమూడయంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే..
ఖమ్మం జిల్లా మధిర మార్కెట్ యార్డుకు చెందిన కార్యదర్శి కే. చౌదారెడ్డి, వయసు 57 సంవత్సరాలు.. మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఖమ్మం జిల్లా రాపర్తినగర్ టీఎన్‌జీవోస్ కాలనీలో నివాసం ఉంటున్న చౌదారెడ్డి హఠాత్తుగా తనకు విపరీతంగా ఛాతి నొప్పి వస్తుందని చెప్పాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమద్యలోనే కన్నుమూసినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఆయనను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. చౌదారెడ్డి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. 2018 నుంచి చౌదారెడ్డి మధిర మార్కెట్ యార్డు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మృతి పట్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు తదితరులు ఆయనకు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గత ఏడాది నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో అక్కడ గుండెపోటు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ తో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ఇటీవల గుండెపోటు తో అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నారు.. ఆస్పత్రికి తరలించేలోపు చనిపోతున్నారు. ఎక్కువ క్రీడలు, వ్యాయామం, డ్యాన్స్ చేసేవాళ్లకు హార్ట్ ఎటాక్ రావడంతో కన్నుమూస్తున్నారని.. అధిక ఒత్తిడికి గురైవారు కూడా హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారని వైద్యులు చెబుతున్నారు.