నగరీకరణ పేరుతో రోజు రోజుకు చాలా చోట్ల అడవులు అంతరించిపోతున్నాయి. దీని కారణంగా అడవిలో ఉండే జంతువులు మెల్ల మెల్లగా గ్రామాల్లోకి వస్తున్నాయి. పులులు, నెమలిలు, కోతులు వంటివి అడవులను వీడి ఊళ్లోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే కోతులు రోడ్లపైకి వచ్చి నానా హంగామ సృష్టిస్తున్నాయి. అయితే తాజాగా కోతుల బీభత్సంతో అన్యాయంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గత కొంత కాలం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. రోడ్లపై, గ్రామాల్లోకి ప్రవేశిస్తూ నానా హంగామ సృష్టిస్తున్నాయి. ఇంతటితో ఆగక కోతులు అన్ని గుంపులు గుంపులుగా చేరి గ్రామ ప్రజలను బెదిరిస్తున్నాయి. ఇదిలా ఉంటే చంచుపల్లి ప్రాంతానికి చెందిన రత్నం అనే వ్యక్తి సింగరేణిలో ఉద్యోగం చేసి ఈ మధ్యకాలంలోనే రిటైర్డ్ అయ్యాడు. అయితే ఇటీవల రత్నం ఉదయం పూట ఆరుబయట కూర్చుని చలిమంట కాగుతున్నాడు. ఈ క్రమంలోనే కోతులు గుంపులు గుంపులుగా వచ్చి క్షణాల్లో రత్నంను చుట్టుముట్టాయి.
అనంతరం అన్ని కోతులు కలిసి అతనిపై దాడి చేయడంతో అతడు మంటల్లో పడి కాలిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన అతని కుటుంబ సభ్యులు కోతులను చెదరగొట్టి వెంటనే రత్నంను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందిన రత్నం తాజాగా ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి కోతుల బెడద నుంచి తట్టుకోలేకపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రత్నం మరణంతోనైన అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.