అప్పుడే పదో తరగతి పాసైన ఓ పల్లెటూరి కుర్రాడు ఏదో సాధించాలనే తపనతో హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా.. గుండెనిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకొన్నాడు. నెత్తిన గంప పెట్టుకొని చిత్తు కాగితాల వ్యాపారం మొదలుపెట్టాడు. నేడు కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తూ, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అతడి జీవిత ప్రయాణం ఇలా సాగింది.
ఆయన పేరు మంగినిపల్లి యాదగిరి.. చదువుకున్నది పదో తరగతి. నిరుపేద కుటుంబంలో జన్మించిన యాదగిరి.. డబ్బుల్లేక కుటుంబం పడుతున్న ఇబ్బందులు కళ్లారా చూశాడు. వీటి నుండి కుటుంబాన్నిఎలాగైనా బయటపడేయనుకున్నాడు. అంతేకాకుండా ఇద్దరి తమ్ముళ్లను మంచిగా చదివించి, ఉన్నత స్థాయికి తీసుకురావాలనుకున్నాడు. ఇలాంటి కోరికలతో గ్రామంలో బతుకుదెరువు కష్టమని హైదరాబాద్ కు వచ్చి చెత్త కాగితాలను ఏరుకుంటూ జీవనం సాగించాడు. అక్కడి నుంచి ఆయన తల రాతే మారింది. అది ఎలా అనుకుంటున్నారా అయితే ఆయన మాటల్లోనే విందాం.
‘‘మాది మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం కల్వకుంట్ల గ్రామం. తల్లిదండ్రులు మంగినిపల్లి పోచమ్మ, పోచయ్య. నలుగురు అన్నదమ్ముల్లో నేనే పెద్ద. ఆస్తులేం లేకున్నా మా నాన్న అందర్నీ చదివించాడు. ఆ రోజుల్లో మా ఊళ్లో ఏదైనా పండుగైతే, హైదరాబాద్ నుంచి వేస్ట్ పేపర్ వ్యాపారులు వచ్చేవారు. డబ్బులు బాగా ఖర్చు పెట్టేవారు. భారీగా విరాళాలు ఇచ్చేవారు. వాళ్లను చూసి నేను కూడా హైదరాబాద్ వెళ్లి, చెత్త వ్యాపారంలోకి దిగాలనుకున్నా. నాన్న వద్దని చెప్పినా వినకుండా 1996లో హైదరాబాద్ వచ్చేశా. చెత్త కాగితాలు, పుస్తకాలు సేకరించడం ప్రారంభించా. మొదట్లో నెత్తిన గంప పెట్టుకొని కాలినడకనే తిరిగేవాణ్ని. విద్యానగర్, నల్లకుంట, శంకరమఠం ప్రాంతాల్లో వ్యాపారం చేశా. రూపాయి రూపాయి కూడబెట్టి ఏడాది తర్వాత ఒక పాత సైకిల్ కొనుక్కున్నాను’’ అని తెలిపాడు.
‘‘నన్ను విడిచి ఉండలేక అమ్మానాన్న, తమ్ముళ్లు.. అందరూ హైదరాబాద్ వచ్చేశారు. చిన్న డబ్బా పెట్టుకోవడానికి నాన్నను ఐదువేలు అడిగా. ఆయన ఇవ్వలేదు. కోపంతో ఇంట్లోంచి వచ్చేశా. చిక్కడపల్లిలోని అంబేద్కర్ స్కూల్‌లో మూడు రోజులు ఇసుకలోనే పడుకున్నా. నా బాధ చూసి అమ్మ నాన్నకు సర్దిచెప్పింది. ఏదోలా ఐదువేలు ఇచ్చారు. ఆ మొత్తంతో నారాయణగూడలో ఒక చిన్న డబ్బా ఏర్పాటు చేసుకున్నా. వీధివీధి తిరుగుతూ చిత్తు కాగితాలు, పుస్తకాలు సేకరించే వారి నుంచి సరుకు కొనడం ప్రారంభించా. ఆ తర్వాత ఇంకో తమ్ముడితోనూ షాపు పెట్టించా. కొన్ని రోజులకు నాన్న కూడా సాయం చేయడం మొదలుపెట్టారు. అంతా బాగుందనుకొనే సమయానికి, మాకు మెటీరియల్ అమ్మే వాళ్లంతా షాపులు పెట్టుకున్నారు. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడే మరో ఆలోచన వచ్చింది. ఓ గోడౌన్ అద్దెకు తీసుకొని, షాపులు పెట్టిన వారి దగ్గరి నుంచే సరుకు కొనడం మొదలుపెట్టాను’’ అని తెలిపాడు.
‘‘తొలుత వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. కానీ నెమ్మదిగా వాటన్నింటిని తట్టుకుని నిలబడ్డా. ఈ వ్యాపారంలో అప్పటికే ఎంతోమంది ఉన్నారు. అయితే, నేను మాత్రం సరుకు ఇచ్చిన వెంటనే డబ్బులు ఇస్తానని చెప్పా. అప్పటివరకు అలా ఇచ్చిన వ్యాపారులు లేరు. దీంతో బిజినెస్ పెరిగింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈరోజు నాకు అంబర్‌పేటలో మూడు పెద్ద గోడౌన్లు ఉన్నాయి. వాటి నుంచి దేశంలోని అన్ని పేపర్ మిల్లులకూ సరుకు వెళ్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ మెటీరియల్ నా దగ్గరికి వస్తుంది. నా దగ్గర 80మంది ఉపాధి పొందుతున్నారు. నెలకు రూ.5 కోట్ల లావాదేవీలు జరుపుతున్నా. ఏడు వాహనాలు ఉన్నాయి. రూ.కోటి విలువ చేసే మిషనరీ ఉంది’’ అని తెలిపాడు.
నాన్న గర్విస్తున్నారు..
‘‘నేను అనుకున్నట్లుగానే తమ్ముళ్లను బాగా చదివించా. ఒక తమ్ముడు ప్రభుత్వ ఉద్యోగి. మరొక తమ్ముడు వ్యాపారంలో నాకు తోడుగా ఉంటున్నాడు. నాకు ఇద్దరు పిల్లలు. అంతా సంతోషంగా కలిసి మెలిసి ఉంటాం. ఒకప్పుడు హైదరాబాద్ వెళ్తానంటే వద్దన్న నాన్నే.. ఈ రోజు ‘నిన్ను చూస్తే గర్వంగా అనిపిస్తుంది బిడ్డా’ అంటున్నారు. చిత్తు కాగితాలు, పాత పుస్తకాలు కొనేదగ్గర నుంచి ఇంత పెద్ద వ్యాపారాన్ని నిర్వహించే స్థాయికి ఎదిగినందుకు సంతోషంగా ఉంది. అంబర్‌పేట్ అలీ కేఫ్ దగ్గరికి వెళ్లి ఎవరిని అడిగినా.. నా అడ్రస్ చెబుతారు. ఈ గుర్తింపు.. నా కష్టానికి ఫలితం’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.
సామాజిక సేవలోనూ..
‘‘సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సాయం చేయాలనుకున్నా. మా ఊరి పాఠశాలలో పలు అభివృద్ధి పనులు చేశా. బాగా చదువుకునే పిల్లలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని మొత్తం మండలానికి విస్తరించాలని నిర్ణయించుకున్నా. ఇందుకోసం ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేస్తున్నా. మా ఊరి శివాలయానికి నా వంతుగా రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చా. ఆ పనులన్నీ దగ్గరుండి నేనే చేయిస్తున్నా’’ అని తెలిపాడు.