తెలంగాణ, మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని కౌకుంట్లలో రైలు ఢీకొని 335 గొర్రెలు మృతి చెందాయి. కుక్కలు తరమడంతో గొర్రెలు ఒక్కసారిగా రైలు పట్టాలపైకి వచ్చేశాయి. అదే సమయంలో అటుగా వచ్చిన రైలు గొర్రెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 335 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి. చెల్లా చెదురుగా పడి ఉన్న ఆ జీవాలను చూసిన వారందరు కంటతడిపెడుతున్నారు. వాటి మీదే ఆధారపడి జీవించే బాధితులు.. ఈ ఘటనతో లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
కాగా, జులైలోనూ ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కోరుట్ల మండలం చిన్నమెట్‌పల్లి వద్ద.. రైల్వే ట్రాక్ దాటుతోన్న గొర్రెలను ఓ గూడ్స్ ట్రైన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 80 గొర్రెలు అక్కడికక్కడే మరణించాయి. నిత్యం ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల కారణంగా వాటిపై ఆధారపడి జీవించే బాధితులు.. ఏమి చేయాలో తెలియక ప్రాణాలు తీసుకోవడానికి వెనుకాడట్లేరు. ఇలా మూగజీవాల ప్రాణాలు అర్థాంతరంగా గాలిలో కలిసిపోతున్నాయి.