దేశ వ్యాప్తంగా వినాయక చవితి పండగను ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం గణేశ్ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. బొజ్జ గణపయ్యకు నవ రాత్రులు విభిన్నమైన పూలతో అలకరించి, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో కొన్నిచోట్లు గణేషుడి నిమజ్జనం కూడా ప్రారంభమైంది. భక్తులు గణనాధుడిని గంగమ్మ ఒడిలో చేరుస్తోన్నారు. అయితే హిమాయత్ నగరలో నిమజ్జననోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. 20 అడుగుల భారీ వినాయకుడు నిమజ్జనానికి తరలి వెళ్తోన్న సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. వివరాల్లోకి వెళ్తే..
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక కొన్ని చోట్లు మండపాల్లో కొలువుదీరిన వినాయక విగ్రహాలు కూడా తడిశాయి. కర్మన్ ఘాట్ కు చెందిన నవజీవన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 9 రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు నిర్వహించారు. గురువారం కురిసిన భారీ వర్షానికి తెల్లవారుజామున ఆ గణేష్ విగ్రహం కూడా తడిసింది. శుక్రవారం నిమజ్జనానికి వెళ్తుండగా మార్గం మధ్యలోనే హిమాయత్ నగర్ సమీపంలో కూలిపోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు క్రేన్ సహాయంతో విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు.