దేశంలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తుంటారు. హెల్మెట్ పెట్టుకోవాలని, రాంగ్ రూట్‌లో వెళ్లొద్దని, సిగ్నల్ జంప్ చేయొద్దని వాహనదారులను కోరుతుంటారు. ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండొచ్చని అవగాహన కల్పిస్తుంటారు. ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించకపోతే పోలీసులు చలాన్లు వేస్తుంటారు. చలానాలు కట్టకుండా తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే పోలీసులకు వాహనం చిక్కితే ఎలాంటి చర్యలు తీసుకుంటారనే భయంతో.. చాలా మంది వాహనదారులు ఏవైనా పెండింగ్ చలాన్లు ఉంటే వెంట వెంటనే కట్టేస్తున్నారు.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. నాంపల్లిలో ట్రాఫిక్ పోలీసులు హూండా యాక్టీవా వాహనాన్ని ఆపి చెక్ చేశారు. ఆ స్కూటీకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 117 పెండింగ్ చలాన్లు ఉండటంతో ఒక్కసారే షాక్ తిన్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ బైక్‌పై 2015 నుంచి చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. చలానా విధించిన ఏ ఒక్క ఫోటోలోనూ హెల్మెట్ లేదని.. కరోనా పీక్స్ టైమ్‌లో కూడా మాస్క్ లేకుండానే తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం చలాన్ల విలువ 30,000 వేల రూపాయలుగా ఉంది.
చలాన్లు కట్టకుండా తిరుగుతున్న హోండా యాక్టివా యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో పోలీసులు పెండింగ్ చలాన్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కూడళ్లలో వచ్చే పోయే ప్రతీ వాహనాన్ని పరిశీలిస్తున్నారు. వేయి రూపాయల కంటే ఎక్కువ బాకీ ఉంటే వాహనదారులు ఖచ్చితంగా మీ-సేవలో కానీ, ఆన్లైన్లో కానీ పేమెంట్ చేసినట్లుగా చూపిన తరువాతే వాహనం అప్పగిస్తున్నారు. చలాన్లు కట్టకుంటే మోటార్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.