నెల రోజులు కూడా నిండని పసి పాప. శ్వాస ఆగిపోయింది. గుండె, నాడి కొట్టుకోవడం లేదు. అలాంటి పాపకు చాలా సున్నితంగా సీపీఆర్ చేశారు 108 సిబ్బంది. సీపీఆర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే 108 సిబ్బంది సీపీఆర్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది.
వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు అందరికీ వచ్చేస్తుంది. చిన్నపిల్లలు, యువకులు, నడి వయసు వారు, వయసు పైబడిన వారు అని తేడా లేదు. ఇటీవల కాలంలో గుండెపోటుతో యువకులు, పిల్లలు మరణించిన సంఘటనలు చూశాం. అయితే గుండెపోటు వచ్చి పడిపోయిన వారికి కొందరు హీరోలు చాకచక్యంగా వ్యవహరించి సీపీఆర్ చేసి బతికించిన సంఘటనలు కూడా చూశాం. సీపీఆర్.. ప్రస్తుతం ఇది గుండెపోటు వచ్చి పడిపోయిన వారిని బతికించే సంజీవని. ఈ సంజీవనితో అప్పుడే పుట్టిన చిన్నారిని కూడా బతికించింది. నెల రోజులు కూడా నిండని పాపకు శ్వాస ఆగిపోతే సీపీఆర్ చేసి బతికించారు. ఈ సంఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్ కు చెందిన ప్రేమ్ నాథ్ యాదవ్, కవిత దంపతులు చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పని చేస్తున్నారు. వీరికి ఇటీవలే ఒక పాప పుట్టింది. పాప వయసు 23 రోజులు. సుబ్బలక్ష్మి అని పేరు కూడా పెట్టుకున్నారు. అయితే పాపకు స్నానం చేయిస్తుండగా వేడి నీళ్లు మింగడంతో శ్వాస ఆగిపోయింది. వెంటనే గ్రామానికి చెందిన ఆశా వర్కర్ సుగుణ, ఏఎన్ఎం తిరుమల 108 కి కాల్ చేసిన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది అశోక్, వెంకట్ వెంటనే స్పందించి.. సకాలంలో ఘటన స్థలానికి చేరుకున్నారు. పాప గుండె, నాడి కొట్టుకోవడం లేదని గమనించిన సిబ్బంది.. ఈఆర్సీపీ డాక్టర్ చక్రవర్తికి కాల్ చేసి విషయం చెప్పారు. ఆయన ఇచ్చిన సూచనలను అనుసరించి 108 సిబ్బంది కదులుతున్న సీపీఆర్ చేస్తూ సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీన్ని వీడియో తీయగా మంత్రి హరీష్ రావు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ గా మారింది.
‘సిద్ధిపేట జిల్లా కోడూరు మండలంలో 23 రోజుల బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి అభినందనలు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి చేసిన మీ సేవలు అమూల్యం’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్స్ 108 సిబ్బందిపై అభినందనలు తెలియజేస్తున్నారు. సెల్యూట్ అంటూ కొనియాడుతున్నారు. మరోవైపు తమ పాప ప్రాణాలు కాపాడినందుకు 108 సిబ్బందికి తల్లిదండ్రులు, బంధువులు కృతజ్ఞతలు తెలియజేశారు. మరి 23 రోజుల చిన్నారికి సీపీఆర్ చేసి బతికించిన 108 సిబ్బందికి మీరు కూడా అభినందనలు తెలియజేయండి. అలానే ఈ విషయాన్ని మీ సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఎప్పుడైనా, ఎక్కడైనా పసి బిడ్డలు చలనం లేని స్థితిలో ఉంటే సీపీఆర్ చేసి బతికించే అవకాశం ఉంటుందన్న అవగాహన కల్పించండి.
సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో 23 రోజుల బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి అభినందనలు 💐
అత్యవసర సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి చేసిన మీ సేవలు అమూల్యం🙏🏻CPR Saves Lives. pic.twitter.com/tItoUzi1Vj
— Harish Rao Thanneeru (@BRSHarish) April 5, 2023