ఏదైనా పండుగ వస్తుందంటే చాలు ఈ-కామర్స్ సైట్లు ఆఫర్లకు తెరతీయడం కామన్. ఫలానా ఉత్పత్తులపై 50 శాతం తగ్గింపు.. ఫలానా ప్రొడక్ట్స్ పై 60 శాతం వరకు డిస్కౌంట్ అంటూ ఆఫర్లతో వినియోగదారుల్ని ఊరిస్తుంటాయి. సాధారణంగా ఈ సేల్స్ లో చాలా వరకు ఉత్పత్తులను తగ్గింపు ధరకే అందిస్తున్నా.. కొన్ని వస్తువులపై మాత్రం పెద్దగా తగ్గింపు ఉండదు. కానీ వాటినీ తక్కువకే ఇస్తున్నామని ప్రకటించడంతో సేల్స్ లో తక్కువ ధరకే కొన్నామని సంబరపడుతుంటారు కొనుగోలుదారులు. ఇదిలావుంటే.. ఇటీవల ఎక్కువుగా వినపడుతున్న పేరు.. ‘ఎక్స్చేంజ్ ఆఫర్‘.
ఎక్స్చేంజ్ ఆఫర్ లో రూ.15 వేల విలువైన ఫోన్ రూ.4 వేలకే, రూ.20 వేల విలువైన ఫోన్ రూ.9 వేలకే.. అంటూ అప్పుడప్పుడూ వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. ఇలాంటి ఆఫర్లు చూసిన వెంటనే చాలామంది ఎడాపెడా కోనేస్తుంటారు. ఇందులో పనిచేయని ఫోన్లను ఎక్స్చేంజ్ చేసేవారు కొందరైతే.. తాము వాడుతున్న ఫోన్లను కూడా ఎక్స్చేంజ్ చేసేవారు మరికొందరు. కంపెనీలు ఇలా ఇవ్వడం వెనుక ఓ పెద్ద మతలబే ఉంది. ఈ ఆఫర్ తో కంపెనీలు నష్టపోయేదాని కంటే లాభపడేదే ఎక్కువ.
ఉదాహరణకు.. ఒక వ్యక్తికి గేములు ఆడడమంటే బాగా ఇష్టం. అందుకోసం రూ. 30 వేలు పెట్టి ఒక ఫోన్ కొన్నాడనుకుందాం. అయితే ఆ ఫోన్ ఎక్కువ యానిమేషన్స్ ఉన్న గేములకు సపోర్ట్ చేయట్లేదు అనుకోండి. వెంటనే అతని మదిలో తట్టే ఆలోచన.. ఇది ఎవరికైనా అమ్మేయాలి.. మరొకటి కొనుక్కోవాలి. ఇలాంటి వారిని బోల్తా కొట్టించడానికే కంపెనీలు ఎక్స్చేంజ్ ఆఫర్ తీసుకొచ్చాయి. మరికొందరు ఉంటారు. హైఎండ్ ప్రీమియం ఫోన్లు వాడుతున్నవారు. వీరికి కొత్తగా లాంచ్ అయ్యే ఫోన్లు అంటే మహా ఇష్టం. ఉదాహరణకు.. ఐఫోన్ 14 రిలీజ్ అయ్యిందనుకోండి.. అప్పటివరకు వారిదగ్గరున్న ఐఫోన్ 12/ ఐఫోన్ 13 ను ఎక్స్చేంజ్ లో పెట్టి దాన్ని సొంతం చేసుకుంటుంటారు.
ఇలా ఎక్స్చేంజ్ ఆఫర్ లో రిసీవ్ చేసుకున్న ఫోన్లలో 6 నుంచి 8 నెలల మాత్రమే వాడినవి ఉంటాయి. చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉన్నవి ఉంటాయి. పూర్తిగా డామేజ్ అయినవి ఉంటాయి. ఫోన్ లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు లేదా చిన్న చిన్న మైనర్ రిపేర్లు అనుకోండి.. వాటిని కొత్తదానిలా సింగారించి ‘Refurbished Phone’ అంటూ ఈ-కామర్స్ సైట్లలోనే అమ్మకానికి పెడుతుంటాయి. ఉదాహరణకు.. 50 వేల రూపాయల ధర ఉన్న iPhone 6Sనో లేదా ఇంకో phoneనో.. 10 వేలు తక్కువ ధరతో 42,000లకు Refurbished మొబైల్ పేరుతో అమ్మకానికి పెడుతుంటాయి. అలాగని ఇవి secondhand కాదు.. Refurbished phone అని చెప్తుంటాయి. చాలా మంది దీనర్థం తెలియక తక్కువ ధరకి వస్తున్నాయని ఇలాంటివి కొంటుంటారు. ఇలా ఎక్స్చేంజ్ ఆఫర్ లో రిసీవ్ చేసుకున్న ఫోన్లను తిరిగి వినియోగదారులకే కట్టబెడుతుంటాయి కంపనీలు. కావున ఇలాంటి ఆఫర్ల పట్ల కొనుగోలుదారులకు అప్రమత్తత అవసరం.