వాట్సాప్.. సోషల్ మెసేజింగ్ యాప్ లో తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. ఈ వాట్సాప్ కు పోటీ ఇచ్చేందుకు దరిదాపుల్లో కూడా వేరే యాప్స్ కనిపించడం లేదు. కానీ, ఈ మధ్యకాలంలో మళ్లీ టెలిగ్రామ్.. వాట్సాప్ కు ప్రత్యామ్నాయం కాగలదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాట్సాప్ వ్యక్తిగత సమాచార గోప్యత విషయంలో అనుమానాలు టెలిగ్రామ్ కు చాలా ప్లస్ అవుతున్నాయి. అలాగే ఫీచర్ల విషయంలో కూడా టెలిగ్రామ్ తీసిపారేయడానికి లేదు. ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో మరోసారి టెలిగ్రామ్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. మరోవైపు వాట్సాప్ సంస్థను కూడా కాస్త ఇరకాటంలో పెట్టేట్టుగానే ఉంది.
టెలిగ్రామ్ సంస్థకు ఒక్క ప్లేస్టోర్ లోనే 1 బిలియన్ ప్లస్ డౌన్లోడ్లు ఉన్నాయి. 4.2 రేటింగ్ తో 11 మిలియన్ రివ్యూలతో దూసుకుపోతోంది. ఈ లెక్కలు వాట్సాప్ కు కాస్త దూరంగానే ఉన్నా కూడా రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మారుంతుందని అటు టెక్ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయతే ఇప్పుడు టెలిగ్రామ్ కొన్ని సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఎప్పటికప్పుడు అప్ డేట్లు, ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా ఏమోజీలు, ప్రొఫైల్ ఫొటో మేకర్, చాట్ ట్రాన్స్ లేటర్ అంటూ కొన్ని ఫీచర్లను తీసుకొచ్చింది. వీటికి సంబంధించి వినియోగదారుల నుంచి మంచి స్పందన కూడా వస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రొఫైల్ పిక్చర్ మేకర్ ఆప్షన్ తో.. వినియోగదారులు తమ చిత్రంతో ఏదైనా యానిమేటెడ్ స్టిక్కర్, లేదా ఏమోజీ సాయంతో ప్రొఫైల్ పిక్చర్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం దాదాపుగా పది లక్షలకు పైగా ఏమోజీలను అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా స్టిక్కర్లు, ఏమోజీలను వర్గాల వారీగా విడదీసింది కూడా. ఇలా చేయడం వల్ల వినియోగదారులు వాటిని వినియోగించే సమయంలో వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇంక ప్రొఫైల్ పిక్చర్ కూడా మెటా సంస్థ వాళ్లు అవతార్ అని తీసుకొచ్చినట్లుగా వీళ్లు యానిమేటెడ్ ఫీచర్ తో ప్రొఫైల్ పిక్చర్ మేకర్ అంటూ తీసుకొచ్చారు.
ఇంక మరో అద్భుతమైన ఫీచర్ ఒకటి అందుబాటులో ఉంది. ఆ ఫీచర్ ఏంటంటే మీరు చేసే చాటింగ్ ని ట్రాన్స్ లేట్ చేయచ్చు. అవును మీరు విన్నది నిజమే. మీరు ఏదైనా చాట్ చేస్తున్నప్పుడు ఆ చాట్ మొత్తాన్ని సెలక్ట్ చేసుకుని ట్రాన్స్ లేట్ చేసుకోవచ్చు. పైన ట్రాన్స్ లేట్ ఎంటైర్ చాట్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని ఉపయోగించి చాట్ మొత్తాన్ని ట్రాన్స్ లేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఫీచర్ ను కేవలం ప్రీమియం వినియోగదారులకు మాత్రమే అని చెబుతున్నారు. అంటే ఫ్రీగా ఈ ఫీచర్ వాడుకునే అవకాశం లేదనే చెప్పాలి. ఇంక ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లను ఎప్పటికప్పుడు తీసుకొచ్చి వాట్సాప్ కు ప్రత్యామ్నాయం తామనే విషయాన్ని తెలియజేస్తామని టెలిగ్రామ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.