కొందరు ప్రతి చిన్న సమస్యకు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాలే చాలామంది తమ నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కొందరు సమస్యకు పరిష్కారం మార్గం ఆలోచించడం మానేసి ఆత్మహత్యే సమాధానంగా భావిస్తుంటారు. అంతే క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి.. వారి కుటుంబ సభ్యులకు తీరని వేదనను మిగుల్చుతున్నారు. అయితే ఈ దారుణాలకు పాల్పడే వారు వివిధ మార్గాలను ఎంచుకుంటుంటారు. అందులో ఒకటి ఫ్యాన్ కి ఉరి వేసుకోవడం. అయితే తమ పరికరం వాడితో ఫ్యానుకు ఉరేసుకోలేరని ఓ కంపెని అంటుంది. తాము ఉత్పత్తి చేస్తున్న ఆ పరికరాన్ని వాడితే సీలింగ్ ఫ్యాన్ కు ఉరి తాడు బిగించి వేళాడినా అది ప్రాణాలు పోయేందుకు దారి తీయదని ఆ కంపెనీ చెబుతోంది.
బెంగళూరులో నిర్వహిస్తున్న పెట్టుబడిదారుల సమావేశంలో ఈవినూత్న పరికరాన్ని ప్రదర్శించారు. సేఫ్ హోలో అనే ప్రముఖ ఎలక్ట్రిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఈ పరికరాన్ని తయారు చేసింది. తాము తయారు చేసిన ఫ్యాన్ కు సంబంధించిన డివైజ్ ను వినియోగిస్తే ఆత్మహత్యలకు పాల్పడం సాధ్యపడదని సదరు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సేఫర్ ఫ్యాన్ పేరుతో రూపొందించిన ఈ పరికరంలో అమర్చిన సేఫ్ క్లాంప్ లో ఉన్న స్ప్రింగ్..20 కేజీల కంటే ఎక్కువ బరువున్న వస్తువులు ఆపలేదు. అందుకే సేఫ్ క్లాంప్ వలన 20 కిలోల కంటే ఎక్కువ బరువున్న వస్తువు వేలాడుతూ నిదానంగా కిందకు జారిపోతోంది. అంతేకాక ఇందులో ఓ అలారం కూడా ఉంటుంది.
అది బలమైన వస్తువులు వేలాడినప్పుడు అలారం పెద్దగా మోగుతుంది. దీంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు జరగబోయే ప్రమాదాన్ని ముందే ఆపవచ్చు. ఈ సేఫర్ క్లాంప్ తో ఫ్యాన్ ను పైకప్పునకు నేరుగా బిగిస్తే చాలని సంస్థ టెక్నికల్ డైరెక్టర్ సుమంత్ తెలిపారు. తాము ఉత్పత్తి చేసిన ఈ పరికరం ఉపయోగిస్తే సీలింగ్ ఫ్యాన్ కు ఉరితాడు బిగించి వేళాడిన అది మరణానికి దారి తీయదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ పరికరాలను 1.2 లక్షల విక్రయించినట్లు ఆయన తెలిపారు.