55 అంగుళాల స్మార్ట్ టీవీ, అది కూడా 4కే రిజల్యూషన్ ఉన్న టీవీ ఒక కంపెనీ ఉచితంగా ఇచ్చేస్తుంది. ఒకరో ఇద్దరికో కాదు, ఏకంగా 5 లక్షల మందికి ఫ్రీగా ఇస్తుంది.
స్మార్ట్ టీవీ కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. ఈరోజుల్లో మంచి ఫీచర్స్ తో పెద్దగా ఉన్న స్మార్ట్ టీవీ కొనాలంటే రూ. లక్ష పైనే అవుతుంది. 55 అంగుళాల సైజు, 4కే రిజల్యూషన్ కలిగిన శాంసంగ్ స్మార్ట్ టీవీ ధర రూ. 2 లక్షల పైనే ఉంది. ఆఫర్ లో రూ. 1,77,990 పలుకుతోంది. ఇదే ఫీచర్స్, డిస్ప్లే సైజుతో రూ. 30 వేలకు కూడా దొరుకుతున్నాయి. కానీ ఉచితంగా ఏ కంపెనీ ఇస్తుంది చెప్పండి. కానీ ఒక టీవీ కంపెనీ మాత్రం ఉచితంగా రూ. 82 వేల రూపాయల స్మార్ట్ టీవీని ఇస్తుంది. అలా అని ఇదేమీ చిన్న టీవీ ఏమీ కాదు. 55 అంగుళాల స్క్రీన్, 4కే రిజల్యూషన్ తో వస్తుంది. అంతేనా డ్యూయల్ స్క్రీన్ దీని ప్రత్యేకత.
అయితే ఈ డ్యూయల్ స్క్రీన్ కారణంగానే ఆ కంపెనీ ఉచితంగా టీవీని ఇస్తుంది. టెలీ అనే టీవీ బ్రాండ్ ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. ప్లూటో టీవీ సహ వ్యవస్థాపకుడు ఇలియా పోజిన్ ఈ స్మార్ట్ టీవీని ఉచితంగా అందిస్తున్నారు. ఇలా ఉచితంగా ఇస్తే కంపెనీకి లాభం ఏమిటి అనే కదా ఆలోచిస్తున్నారు. మరేం లేదండి.. ఈ స్మార్ట్ టీవీలో రెండు స్క్రీన్లు వస్తాయి. మొదటిది పెద్దగా ఉంటుంది. రెండవది చిన్నగా ఉంటుంది. పెద్ద స్క్రీన్ లో మనకి నచ్చిన కంటెంట్ చూడవచ్చు. రెండవ స్క్రీన్ మాత్రం కంపెనీకి చెందినది. ఇందులో ప్రకటనలు వస్తుంటాయి. టీవీ చూసిన ప్రతిసారీ కింద స్క్రీన్ అనేది ఎప్పుడూ ఆన్ లోనే ఉంచాలి. అప్పుడే ఈ ఉచితం అనే కాన్సెప్ట్ అప్లై అవుతుంది. స్మార్ట్ డిస్ప్లేగా పిలవబడే ఈ రెండవ స్క్రీన్ మెయిన్ టీవీ నుంచి సౌండ్ బార్ తో సెపరేట్ చేయబడి ఉంటుంది.
ఈ స్క్రీన్ లో వాతావరణం, న్యూస్ టిక్కర్స్, క్రీడలకు సంబంధించిన స్కోర్లు, స్టాక్ మార్కెట్ రేట్లు వంటివి డిస్ప్లే అవుతుంటాయి. పైన ఉన్న మెయిన్ టీవీ మాత్రం ఉచితం. అయితే మీరు ఇంటర్నెట్ డేటాని ఖర్చు చేయాల్సి ఉంటుంది. టెలీ అనేది అమెరికన్ కంపెనీ. యూజర్ డేటాను ప్రకటనదారులకు అమ్మడమే టెలీ బిజినెస్ మోడల్. అయితే ప్రైవసీ విషయంలో లిమిట్స్ దాటమని కంపెనీ చెబుతోంది. మొదటి 5 లక్షల మందికి మాత్రమే ఈ టీవీని ఉచితంగా ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇండియాలో ఇంకా ఈ ఉచిత స్మార్ట్ టీవీ కాన్సెప్ట్ ను ప్రారంభించలేదు. ప్రస్తుతం అమెరికా వారికి మాత్రమే అవకాశం ఇచ్చింది.
అక్కడ విజయవంతమైతే మిగతా దేశాలకు ఈ బిజినెస్ మోడల్ ని విస్తరించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ టీవీ ఖరీదు వెయ్యి డాలర్లు పైనే ఉంటుందని కంపెనీ కో ఫౌండర్ వెల్లడించారు. భారత కరెన్సీ ప్రకారం రూ. 82 వేలు పైమాటే. ఇక టెలీ రివార్డ్స్ పేరుతో మరొక కాన్సెప్ట్ మీద పని చేస్తుంది. ఆన్ స్క్రీన్ పోల్స్, ఇతర యాక్టివిటీస్ లో పాల్గొంటూ కూడా వినియోగదారులు నెట్ ఫ్లిక్స్, స్టార్ బక్స్ వంటి వాటి నుంచి గిఫ్ట్ కార్డులు పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. ఫ్రీ టెలీ వెబ్ సైట్లో దీనికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. సాధారణంగా మెయిన్ టీవీలోనే ప్రకటనలు ఇచ్చుకోవచ్చు. కానీ ప్రకటనల కోసం ప్రత్యేకంగా స్క్రీన్ తయారు చేసి మరీ 55 అంగుళాల 4కే స్మార్ట్ టీవీని ఉచితంగా ఇస్తుంది. మరి ఈ కంపెనీపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.