మండే ఎండాకాలాన్ని తట్టుకోవాలి అంటే పట్టణాలు, నగరాల్లో అయితే ఏసీలు, కూలర్లు ఉండాల్సిందే. ఇంట్లో ఉన్నంతసేపు వాటితో మేనేజ్ చేయచ్చు. కానీ ఎండల్లో బయటకు వెళ్లాలి అంటే మాత్రం కష్టమనే చెప్పాలి. అందుకే అలాంటి సమస్యకు సమాధానంగా సోనీ కంపెనీ ఒక పాకెట్ ఏసీని తయారు చేసింది.
మనిషి ఏ కాలంలో అయినా నిశ్చింతగా ఉంటాడు గానీ.. ఎండాకాలం అనగానే మాత్రం బెంబెలెత్తిపోతుంటాడు. మండే ఎండలకు ఎలా తట్టుకోవాలి అంటూ నెల ముందు నుంచే బాగా మదన పడిపోతుంటారు. అయితే కూలింగ్ ఫ్యాన్స్, ఏసీలు, కూలర్లు అంటూ చాలా ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఇంట్లో కూర్చున్నప్పుడు మాత్రమే పనికొస్తాయి. మీరు బయటకు వెళ్లాలన్నా, జర్నీలో ఉన్నా, మధ్యాహ్నం బయటకు వెళ్లాల్సి వచ్చినా కచ్చితంగా ఎండకు మాడి పోవాల్సిందే. అలాంటప్పుడు ఏసీలు, కూలర్లు పనిచేయవు. అలాంటి సమస్యకు సోనీ కంపెనీ ఒక సొల్యూషన్ గా పాకెట్ ఏసీని తీసుకొచ్చింది. ఎంచక్కా మీరు దీనిని జేబులో పెట్టుకుని వెళ్లిపోవచ్చు.
పాకెట్ ఏసీ అనగానే మీకు అందరూ ఒకసారి ఆశ్చర్యపోయుండచ్చు. సోనీ కంపెనీ ఈ ప్రొడక్ట్ ని 2020లోనే రూపొందించింది. దాని పేరు పాకెట్ రియాన్ ఏసీ. అయితే ఈ ఉత్పత్తికి అప్పట్లో పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఒక క్రౌడ్ ఫండింగ్ ప్రాజెక్టుగా సోనీ రియాన్ పాకెట్ ఏసీ 2ని తీసుకొచ్చారు. తాజాగా దీనిని జపాన్ లో విడుదల చేశారు. ఈ డివైజ్ సైజ్ లో కంప్యూటర్ మౌస్ అంతే ఉంటుంది. చాలా స్లిమ్ గా కూడా ఉంటుంది. ఈ డివైజ్ ని ఎండాకాలం కోసం మాత్రమే కాదు.. చలికాలం కూడా వాడుకోవచ్చు. ఎండాకాలంలో కూలింగ్ కోసం.. చలికాలంలో హీట్ కోసం ఇది ఉపయోగపడుతుంది.
ఈ సోనీ రియాన్ పాకెట్ 2 ఏసీతో పాటుగా ఒక టీ షర్ట్ కూడా ఇస్తారు. ఈ టీ-షర్ట్ కి వెనకాల మెడ భాగంలో చిన్న పాకెట్ ఉంటుంది. ఈ డివైజ్ ని ఆన్ చేసి ఆ పాకెట్ లో పెట్టుకోవాలి. డివైజ్ వెనకాల ఒక చిన్నస్టీల్ ప్యానెల్ ఉంటుంది. దానిని మీ శరీరానికి తాకేలా అమర్చు కోవాలి. ఈ టీ-షర్ట్ పై మాములుగా మీ దుస్తులు ధరించవచ్చు. ఇది లిథియం అయాన్ బ్యాటరీతో నడుస్తుంది. దీని ధర విషయానికి వస్తే.. భారత కరెన్సీలో రూ.10,300 వరకు ఉంటుంది. ఈ ధరకి ఒక టీషర్ట్ మాత్రమే అందిస్తారు. అదే డివైజ్ తో పాటుగా ఐదు టీ-షర్ట్స్ కావాలి అంటే రూ.12 వేల వరకు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ డివైజ్ ని కేవలం జపాన్ లో మాత్రమే విడుదల చేశారు.