సెల్ పోన్ అనేది ఇప్పుడు అందరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. దగ్గర ఏ వస్తవు ఉన్నా లేకపోయినా స్మార్ట్ ఫోన్ మాత్రం చేతిలో ఉండాల్సిందే. ఈ ఫోన్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉన్నాయని వినియోగదారులు గుర్తించాలంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్.. ప్రస్తుతం ఇది చాలామందికి శరీర భాగంగా మారిపోయింది. పక్కన ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు.. కానీ, స్మార్ట్ ఫోన్ మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. ఆ ఫోన్ చూసుకుంటూ ఎప్పుడో అర్ధరాత్రి ఒంటి గంటకు, రెండు గంటలకు నిద్రపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సెల్ ఫోన్లకు బానిసల్లా మారిపోయారు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది. ఇప్పుడు ఇండియాలో మారుమూల కూర్చొని అమెరికాలో వారితో వీడియోకాల్ మాట్లాడవచ్చు. అయితే సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ల వల్ల ఉపయోగాలు ఉన్నాయి. లేవని ఎవరూ చెప్పడం లేదు. కానీ, దాని వల్ల వచ్చే అనర్థాల గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి.
అవును సెల్ ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. పరిమితికి మించి వాడితే అంతే అనర్థాలు కూడా జరుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు పగలు ఎలాగూ స్మార్ట్ ఫోన్ ని తరచూ వాడుతూనే ఉంటారు. అలాంటప్పుడు రాత్రుళ్లు నిద్రపోయే సమయంలో స్మార్ట్ ఫోన్ వాడకపోవడం మంచిదని చెబుతున్నారు. అలా రాత్రిపూట కూడా సెల్ ఫోన్ వాడటం వల్ల లేనిపోని రోగాలను కొని తెచ్చుకున్నట్లేనంటూ చెబుతున్నారు. అయితే అసలు రాత్రిపూట సెల్ ఫోన్ ని తల పక్కనే పెట్టుకుని పడుకుంటే ఎలాంటి ప్రమాదాలు వస్తాయి? ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఈరోజుల్లో అందరూ సెల్ ఫోన్ తల పక్కనే పెట్టుకుని పడుకుంటున్నారు. రాత్రిపూట నిద్రపోయే వరకు సెల్ ఫోన్ చేతిలో ఉండాల్సిందే. అలా చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో డాక్టర్ రంగనాథం వివరించారు. రాత్రిపూట సెల్ ఫోన్ తో అవసరం ఉంటుంది, ముఖ్యమైన ఫోన్ కాల్స్ వస్తాయి అనుకునే వారు మాత్రమే ఫోన్ బెడ్ రూమ్ లో పెట్టుకోవాలని చెబుతున్నారు. వాళ్లు కూడా బెడ్ మీద కాకుండా కాస్త దూరంగా ఫోన్ పెట్టుకోవాలని డాక్టర్ చెబుతున్నారు. ఎందుకంటే ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల మీ దృష్టి దెబ్బతింటుంది. అంతేకాకుండా నిద్రలేమి సమస్య ఎదురౌతుందంటున్నారు.
“నిద్ర రావడానికి బ్రెయిన్ లో మెలటోనీ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. మీరు వాడే స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే బ్లూలైట్ వల్ల ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. అంతేకాకుండా మీరు స్మార్ట్ ఫోన్ వాడుతూ నైట్ అంతా అలర్ట్ గా ఉంటారు. సరిగ్గా నిద్రపోలేరు. పెద్దలు అయితే 6 గంటల నుంచి 7 గంటల వరకు నిద్రపోవాలి. యుక్త వయసులో ఉన్నవాళ్లు 7 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. ఈ మెలటోనీ ఉత్పత్తి తగ్గడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. సరిగ్గా నిద్రలేక తెల్లవారిన తర్వాత ఆఫీస్ లో యాక్టివ్ గా ఉండలేరు. ఊరికే చికాకుగా ఉంటారు. పని మీద కాన్సన్ ట్రేట్ చేయలేరు.” అంటూ డాక్టర్ తెలిపారు.
“అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల మీకు నిద్రలేమి సమస్య వస్తుంది. ఈ నిద్రలేమి సమస్యకు తోడుగా.. ఊరికే తలనొప్పి రావడం, అధిక బరువు పెరగడం, రక్తపోటు, జీర్ణకోశ సమస్యలు, కొందరికి అయితే షుగర్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు స్మార్ట్ ఫోన్ వాడితే వచ్చే నిద్రలేమి సమస్యకు అనుబంధంగా చాలా మందికి ఇలాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ఎంతో ప్రమాదం. చాలా మంది ఇప్పుడు చంటిపిల్లలను పక్కన పడుకోబెట్టుకుంటున్నట్లు ఈ స్మార్ట్ ఫోన్లను పెట్టుకుంటున్నారు. ఆ అలవాటును కచ్చితంగా మానుకోవాలి” అంటూ డాక్టర్ రంగనాథం తెలిపారు.