యాపిల్ స్టోర్లు ఇండియాలో ప్రారంభమైన సమయం నుంచి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. నిజానికి టిమ్ కుక్ ఈ స్టోర్లను ప్రారంభించడమే పెద్ద వార్తనుకుంటే.. అంతకు మించిన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వాటిలో ఇన్నాళ్లు యాపిల్స్ స్టోర్స్ డిజైన్ గురించి, ఇంటీరియర్ గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు యాపిల్ స్టోర్స్ లో చేసే ఉద్యోగుల జీతాల గురించి మాట్లాడటం మొదలు పెట్టారు.
ఇప్పుడు టెక్ రంగానికి సంబంధించి ఇండియాలో యాపిల్ స్టోర్స్ గురించే ఎక్కువగా న్యూస్ వైరల్ అవుతోంది. ముంబయి, ఢిల్లీలో స్వయానా టిమ్ కుక్ ఈ యాపిల్ సంస్థకు చెందిన రిటైల్ స్టోర్లను ప్రారంభించారు. భారత్ మార్కెట్ లోకి అడుగుపెట్టి యాపిల్ సంస్థకు 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఒక అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో రిటైల్ స్టోర్ ప్రారంభించడానికి యాపిల్ నిజంగా చాలా సమయం తీసుకుందనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ రెండు స్టోర్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఈ స్టోర్ కి సంబంధించిన ఎన్నో వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది బుర్రని యాపిల్ స్టోర్లో ఉన్న సిబ్బంది జీతం ఎంత? వారి క్వాలిఫికేషన్ ఏంటి? అనే ప్రశ్నలు తొలుస్తున్నాయి.
యాపిల్ సంస్థ భారత్ లో రెండు రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. ఈ స్టోర్ల ద్వారా ఇండియాలో యాపిల్ ప్రొడక్టులను నేరుగా ఆ సంస్థ విక్రయించనుంది. ఈ రెండు స్టోర్లలో కలపి మొత్తం 170 మంది వరకు సిబ్బంది ఉన్నారు. వారిలో సేల్స్ మేనేజర్లు, సేల్స్ పర్సన్లు ఉన్నారు. వీరి జీతం గురించి చెప్పుకోవడానికి ముందు వారి క్వాలిఫికేషన్ల గురించి చెప్పుకోవాలి. వీరంతా ఇంజినీరింగ్, ఎంఎస్సీ, ఎంబీఏ, ఏసీఏ వంటి ఉన్నత విద్యా పట్టాలు కలిగిన వాళ్లే. వీరిలో కేంబ్రిడ్జ్ నుంచి విద్యను అభ్యసించిన వారు కూడా ఉండటం విశేషం. అంతేకాకుండా వీరు 25 భాషల వరకు మాట్లాడగలరు. ప్రస్తుతానికి యూరప్, మిడిలి ఈస్ట్ లో పనిచేస్తున్న కొందరు భారతీయులను భారత్ స్టోర్లకు బదిలీ చేశారు.
వీళ్లందరికి యాపిల్ సంస్థ ఇచ్చిన శిక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వీరికి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చారు. భారతదేశంలో ఏ భాష మాట్లాడే వ్యక్తి యాపిల్ స్టోర్ కి వెళ్లినా ఇబ్బంది లేకుండా ఉండేలా బహుళ భాషలు మాట్లాడగలిగిన వారిని నియమించారు. ముంబయి స్టోర్ లో సిబ్బంది 25 భాషలు మాట్లాడగలిగితే.. ఢిల్లీ స్టోర్ లో ఉండే వాళ్లు 15 భాషలు వరకు మాట్లాడగలరని తెలిపారు. వీరి జీతం విషయానికి వస్తే.. సాధారణంగా రిటైల్ సేల్స్ విభాగంలో నెల జీతం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. కానీ, యాపిల్ సంస్థ వీరిక నెలకు రూ.లక్ష వరకు చెల్లిస్తోంది. అంతేకాకుండా ఇన్సురెన్స్, పెయిడ్ లీవ్స్, యాపిల్ ప్రొడక్టులపై ప్రత్యేక తగ్గింపు, ఎడ్యుకేషన్ సపోర్ట్, స్టాక్ గ్రాంట్లు వంటి అదనపు లాభాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం యాపిల్ సంస్థ ఇస్తున్న జీతమే నెట్టింట తెగ వైరల్ అవుతోంది.