అందరికీ ఆటోలు ఎంతో అందుబాటులో ఉన్నా కూడా.. చాలా మంది వాటిలో ప్రయాణించేందుకు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే భద్రత పరంగా ఆటోల్లో ఎలాంటి ప్రత్యేకమైన ఫీచర్స్ ఉండవు. కానీ, ఇకనుంచి ఆటోల్లో అలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉండనున్నాయి. ఇకపై ఆటోల్లో కూడా సీట్ బెల్ట్స్ ఉండబోతున్నాయి.
భారతదేశంలో ప్రధాన రవాణా సాధనం ఏది అంటే.. టక్కున ఆటో అనే చెబుతారు. రాష్ట్రం, ప్రాంతం సంబంధం లేకుండా ఎక్కడ చూసినా వీటనే రవాణా సాధనంగా ఉపయోగిస్తుంటారు. కానీ, భద్రత విషయంలో మాత్రం వీటికి మార్కులు చాలా తక్కువ పడతాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది ఆటోల్లో ప్రయాణించిన వాళ్లే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే కార్లకు కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ కార్లలో ప్రయాణించేవారిలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రాణాలు కోల్పోతారు. ఎందుకంటే కారులో సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సీట్ బెల్ట్. ప్రమాదంలో సగం తీవ్రతను సీటు బెల్ట్ తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ సీటు బెల్టులు ఆటోల్లో కూడా రాబోతున్నాయి.
ప్రమాదాల్లో మీ ప్రాణాలను కాపాడే విషయంలో ముఖ్యపాత్ర పోషించేవి సీటు బెల్టు అని చెప్పచ్చు. ఇప్పుడు అదే సేఫ్టీ ఫీచర్ ఆటోల్లో రాబోతోంది. ఈ సంచలన నిర్ణయాన్ని ర్యాపిడో సంస్థ తీసుకుంది. తమ ఆటోల్లో ప్రయాణికుల భద్రత కోసం సీట్ బెల్టులను తీసుకొస్తోంది. ర్యాపిడో రెంట్ ఆటోల్లో సీటు బెల్టులను అమర్చనున్నట్లు వెల్లడించింది. తొలుత పైలెట్ ప్రాజెక్టుగా దీనిని బెంగళూరులో చేపట్టనున్నారు. ఆ తర్వాత మిగిలిన నగరాల్లో కూడా ఈ భద్రతా చర్యలను పాటించే అవకాశం ఉంది. ఆటో ఒక్కసారిగా ఆగిపోవడం, లేదా దేనినైనా ఢీకొట్టడం జరిగినప్పుడు ఇవి కాపాడతాయంటూ చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా తమ సంస్థ నియమించిన డ్రైవర్ కెప్టెన్ల వివరాలను తెలుసుకునేందుకు ఫోర్ స్టెప్ వెరిఫికేషన్ అనే సదుపాయం కూడా ఉంది. దీని ద్వారా ఆటో కెప్టెన్ ను మీరు సులభంగా ట్రాక్ చేయచ్చు. వారి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీలుంటుంది. అలాగే మహిళా రైడర్ల భద్రత కోసం ప్రత్యేకమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ మాస్కింగ్ అనే టెక్నాలజీని ర్యాపిడో వాడుతోంది. దీని వల్ల మహిళా కస్టమర్స్ వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో సెఫ్టీ ఫీచర్స్ ని ర్యాపిడో సంస్థ పాటిస్తోంది. ఇలాంటి ఒక నిర్ణయం ర్యాపిడో సంస్థ నుంచి రావడం పట్ల నెటిజన్స్, ర్యాపిడో కస్టమర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ర్యాపిడో తీసుకున్నది చాలా మంచి నిర్ణయం అంటూ నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో మిగిలిన సంస్థలు కూడా ర్యాపిడోను అనుసరించాలంటూ సూచిస్తున్నారు.