ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ చాట్ బాట్ చాట్ జీపీటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే టెక్ రంగంలో అద్భుతాలు సృష్టించింది. ఇప్పుడు ఈ చాట్ జీపీటీపై న్యాయశాస్త్రంలో కూడా ప్రయోగం జరిగింది. దేశంలో తొలిసారి ఈ ప్రయోగం జరగడం విశేషం.
చాట్ జీపీటీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. టెక్ రంగంలో చాట్ జీపీటీ ఒక పెను సంచలనమే సృష్టించింది. ఇప్పటికే ఈ చాట్ జీపీటీని వివిధరకాలుగా వాడేస్తున్నారు. కొందరైతే దీనిని బిజినెస్ గైడ్ గా, మెంటర్ గా కూడా వాడేస్తూ బాగా లబ్ధి పొందుతున్నారు. అయితే ఇంకా ఈ చాట్ జీపీటీపై పలు రకాలుగా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్ లో ఓ న్యాయస్థానం బెయిల్ పిటిషన్ విషయంలో ఈ చాట్ జీపీటీని సలహా అడిగింది. అయితే న్యాయమూర్తి వేసిన ప్రశ్నకు చాట్ జీపీటీ ఒక చక్కని సమాధానం ఇచ్చింది. మొత్తానికి ఆ సమాధానాన్ని వాళ్లు పరిగణలోకి తీసుకోలేదు.
చాట్ జీపీటీ ఇప్పటికే ఎన్నో రంగాల్లో తన మార్క్ ని చూపిస్తోంది. తాజాగా న్యాయ శాస్త్రంలోకి కూడా అడుగు పెట్టింది. పంజాబ్- హర్యానా న్యాయస్థానం ఓ క్రిమినల్ కేసు విషయంలో చాట్ జీపీటీ సలహాని కోరింది. ఇతరులపై క్రూరంగా దాడి చేసిన వ్యక్తి బెయిల్ పిటిషన్ విషయంలో మీరు ఇచ్చే సలహా ఏంటి అంటూ జడ్జిలు చాట్ జీపీటీ ప్రశ్నించారు. అందుకు చాట్ జీపీటీ చక్కని సలహాని ఇచ్చింది. క్రూరత్వంతో మనుషులను చంపుతున్నారు కాబట్టి నేను బెయిల్ పిటిషన్ ని తిరస్కరిస్తున్నాను అంటూ సమాధానం చెప్పింది. తర్వాత అతను చేసిన దాడి తీవ్రతను బట్టి.. అతనికి బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.
ముద్దాయి నిర్దోషి అని నిరూపించేందుకు బలమైన ఆధారాలు ఉంటేనే బెయిల్ ఇచ్చేందుకు అర్హుడని తెలిపింది. ఇలా చాట్ జీపీటీని న్యాయ సలహా కోరడంపై జడ్జిలు స్పంధించారు. ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే అని వెల్లడించారు. భారతదేశంలో ఇలా చేయడం ఇదే ప్రథమం అని కూడా చెబుతున్నారు. చాట్ జీపీటీకి న్యాయశాస్త్రంపై ఎంత మేరకు పరిజ్ఞానం ఉందో తెలుసుకునేందుకు మాత్రమే ఇలా సలహా కోరినట్లు స్పష్టం చేశారు. చాట్ జీపీటీ అభిప్రాయాలు, సలహాలను పాటించేందుకు మాత్రం కాదని తెలిపారు. చాట్ జీపీటీ ఆధారంగా తీర్పులను వెలువరించకూడదని వ్యాఖ్యానించారు. బెయిల్ పిటిషన్ పై చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.