4జీ సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు 5జీ ట్రెండ్ నడుస్తోంది. అయితే 4జీ నెట్ వర్క్ ను చంద్రుడిపై కూడా ప్రారంభించాలని చూస్తున్నారు. అక్కడెవరూ లేరు కద సార్ అని మనకి అనిపించవచ్చు. కానీ చంద్రుడి మీద సెల్ టవర్లు పెట్టాలనుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి.
ప్రముఖ మొబైల్ దిగ్గజ కంపెనీ నోకియా సరికొత్త చరిత్రను సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకూ ఏ సర్వీస్ ప్రొవైడర్ చేయని సాహసం నోకియా చేయనుంది. చంద్రుడిపై 4జీ మొబైల్ నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఫిన్నిష్ టెలికమ్యూనికేషన్స్ గ్రూప్ రాబోయే నెలల్లో స్పేస్ ఎక్స్ రాకెట్ లో నెట్ వర్క్ ను ప్రారంభించాలని నోకియా భావిస్తుంది. ఈ విషయాన్ని నోకియా ప్రిన్సిపల్ ఇంజనీర్ లూయిస్ మాస్ట్రో రూయిజ్ డి టెమినో స్పష్టం చేశారు. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ట్రేడ్ షోలో భాగంగా లూయిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో చంద్రుడిపై 4జీ ఇంటర్నెట్ ను ప్రారంభిస్తామని అన్నారు.
ఈ ఇంటర్నెట్ ను నాసా తన ఆర్టెమిస్-1 మిషన్ లో ఉపయోగించుకుంటుందని.. దీని ద్వారా చంద్రుడిపై మానవ ఉనికిని స్థాపించడమే లక్ష్యమని అన్నారు. భూసంబంధమైన నెట్ వర్క్ లు భవిష్యత్తులో అంతరిక్ష మిషన్ల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చగలవని నిరూపించడమే ఈ చంద్రుడిపై 4జీ నెట్ వర్క్ లాంఛింగ్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. హెచ్డీ వీడియో, రోబోటిక్స్, సెన్సింగ్ అప్లికేషన్లు, టెలిమెట్రీ లేదా బయోమెట్రిక్స్ అవసరమయ్యే భవిష్యత్తు మిషన్లకు సెల్యూలర్ నెట్ వర్క్ లు ప్రారంభించే అధునాతన సామర్ధ్యాలు అవసరమని నోకియా వెల్లడించింది. మరోవైపు ఈ సాంకేతికత ద్వారా చంద్రుడిపై మంచును గుర్తించడంలో శాస్త్రవేత్తలకు సహాయపడుతుందని.. భవిష్యత్తులో ఇంధనం, నీరు, ఆక్సిజన్ లాంటి వాటిని గుర్తిస్తే చంద్రుడి మీద మానవ జీవితాన్ని నిలబెట్టడంలో సహాయపడుతుందని నాసా అంచనా వేస్తుంది.
చంద్రుడిపై 4జీ మొబైల్ నెట్ వర్క్ ను స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ 4జీ నెట్ వర్క్ అనేది సౌరశక్తితో నడిచే రోవర్ ద్వారా పని చేసే నోవా-సి లూనార్ లాండర్ లో యాంటెన్నా ఎక్విప్డ్ బేస్ స్టేషన్ నిల్వ చేయబడి ఉంటుంది. లాండర్ కు, రోవర్ కు మధ్య ఈ ఎల్టీఈ కనెక్షన్ అనేది సెటప్ చేయబడి ఉంటుంది. ఈ 4జీ నెట్ వర్క్ సేవలను నాసా యొక్క భవిష్యత్తు ఆర్టెమిస్ 1 మిషన్ లో వినియోగించనున్నారు. ఈ 4జీ టెక్నాలజీ ద్వారా 1972 తర్వాత తొలిసారిగా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించి నడిచేలా చేయడమే నాసా లక్ష్యమని వెల్లడించింది. మరి చంద్రుడిపై 4జీ నెట్ వర్క్ ను లాంఛ్ చేయనున్న నోకియా కంపెనీపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.