చాట్ జీపీటీ.. ప్రస్తుతం టెక్ రంగంలో ఈ పేరు మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సాంకేతికంగా ఇది ప్రకంపనలు సృష్టించింది. అయితే దీనిపై అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా వస్తోంది. ఇప్పటికే చాలామంది నిపుణులు చాట్ జీపీటీతో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. దీని ద్వారా వచ్చే ఏడాదికాలంలో సైబర్ అటాక్స్ పెరిగే ఛాన్స్ ఉందని బ్లాక్ బెర్రీ సంస్థ తమ రిపోర్టుల్లో వెల్లడించింది. ఇప్పుడు దీని ద్వారా కొందరి ఉద్యోగాలు కూడా ఇప్పుడు ప్రమాదంలో పడనున్నాయని తెలుస్తోంది. కచ్చితంగా కొన్ని రంగాలకు చెందిన వారి ఉద్యోగాలు ఈ ఏఐ టెక్నాలజీ కారణంగా ఊడుతాయని చెబుతున్నారు.
చాట్ జీపీటీ టెక్నాలజీ పరంగా సంచలనం అనే చెప్పచ్చు. దీని ద్వారా కోడింగ్, గణితం, సైన్స్ కూడా చేయచ్చు. దీనితో హ్యాకింగ్ కోడ్స్ కూడా క్రియేట్ చేయచ్చని చెబుతున్నారు. దీని వల్ల ఫైనాన్షియల్, టెక్నాలజీ, లీగల్ సెక్టార్లలో ఉద్యోగాలకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. MLIV పల్స్ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే ఈ సర్వేలో పాల్గొన్న ఫైనాన్షియల్ రంగం, ట్రేడర్స్ మాత్రం తమ ఉద్యోగాలుకు ఢోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరూ పెట్టుబడి పెట్టేందుకు ఏఐ సాఫ్ట్ వేర్ ని నమ్ముకోరని చెబుతున్నారు.
మరోవైపు ఈ తరహా ఏఐ సాఫ్ట్ వేర్ల ద్వారా ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ చాట్ జీపీటీ తరహా ఏఐ బేస్ డ్ సాఫ్ట్ వేర్లపై టెక్ దిగ్గజాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే గూగుల్ సంస్థ చాట్ జీపీటీకి పోటీగా బార్డ్ అనే ఏఐ చాట్ బాట్ ను టెస్టర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంక ఏఐ సైబర్ సెక్యూరిటీ విషయంలో కూడా టెక్ దిగ్గజాలు దృష్టి సారించారు. ఈ విధంగా కూడా ఏఐపై పెట్టుబడులు పెట్టడం, వీలైనంత త్వరగా ఈ ఏఐ సైబర్ సెక్యూరిటీని కూడా డెవలప్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు టెక్ కంపెనీలు ఉద్యోగాలు తీసేస్తూ.. వేల కోట్లలో ఏఐపై పెట్టుబడి పెట్టడంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.