సోషల్ మీడియా.. ప్రస్తుతం దీని గురించి తెలియని వాళ్లు ఉండరేమో. ఏడాది పిల్లలు కూడా యూట్యూబ్‌లో వీడియోలు చూసేస్తున్నారు. ఇంక స్మార్ట్ ఫోన్ ఉన్న ఏ వ్యక్తిని అడిగినా అనర్గళంగా మాట్లాడేస్తారు. అయితే పేరుకు సోషల్ మీడియా అని అంటూ ఉంటాం. దానిలో ముఖ్యంగా ప్రభావితం చేసేవి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. ఆ మూడు ఇప్పుడు మెటా కంపెనీ అధీనంలో ఉన్న విషయం తెలిసిందే. మెటాగా మారిన తర్వాతి నుంచి ఆ సంస్థ సోషల్ మీడియాకి సంబంధించి అప్డేట్లు తీసుకురావడం, కీలక నిర్ణయాలు తీసుకోవడం చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో అంతా ముఖ్యంగా ఉపయోగించేది ఫేస్బుక్. అందుకే మెటా కూడా దానిపైనే ఎక్కువ దృష్టి సారిస్తోంది.
ఫేస్బుక్ ఖాతాలు దాదాపుగా చాలా మందికి ఉన్నాయి. ఫేస్బుక్ లేనివాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అయితే మీకు గుర్తుండే ఉంటుంది. ఫేస్బుక్ ఖాతాను తెరిచే సమయంలో ఒక ప్రక్రియ ఉంటుంది. మీ పేరు, ఊరు, జాబ్, జెండర్, అడ్రస్, అభిరుచులు, రాజకీయ, మతపరమైన, అలవాట్లు ఇలా అబ్బో ఒకటి కాదు, రెండు కాదు ఒక 20 ప్రశ్నలు వరకు అడుగుతారు. అవన్నీ మీరు ఫిల్ చేసుకుంటూ పోవాలి. వాటిలో కొన్ని ప్రశ్నలకు స్కిప్ ఆప్షన్ ఉంటుంది. కానీ, చాలా ప్రశ్నలను మీరు తప్పకుండా ఫిల్ చేయాల్సిందే. అలాగే ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టడం, కొత్త వారిని ఫ్రెండ్స్ చేసుకోవాలి అని చెప్పడం చేస్తుంటారు. అయితే ఇలా చేసేందుకు సదరు యూజర్‌కు చాలా సమయం పడుతుంది. ముందుగా అలా చేసేందుకు విసుగు వస్తుంది.
అందుకే ఇప్పు మెటా సంస్థ ఆ ప్రశ్నలను తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. మీరు కొత్తగా ఖాతా ఓపెన్ చేసే సమయంలో మిమ్మల్ని అడిగే కొన్ని ప్రశ్నల్లో ఓ 4 కేటగిరీలను తొలిగించేందుకు నిర్ణయం తీసుకుంది. అవేంటంటే.. వారి చిరునామా, ప్రొఫైల్ మతపరమైన, రాజకీయ పరమైన అంశాలు, జెండర్ వంటి అంశాలను తొలగించేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. ఒక యూజర్ ప్రొఫైల్‌లో ఇలాంటివి మరో వ్యక్తికి తెలియాల్సిన అవసరం కూడా లేదని మెటా భావిస్తోంది. అందుకే వాటిని నింపేందుకు యూజర్ తన సమయాన్ని ఎందుకు వృథా చేసుకోవాలి అనే ప్రశ్నతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసే వారికి వర్తిస్తుందా? లేక ఇప్పటికే వివరాలు పొందుపరిచినవి వారివి కూడా కనిపించవా? అనే దానిపై మాత్రం డిసెంబర్ 1 తర్వాత క్లారిటీ రానుంది.