సాఫ్ట్ వేర్ జాబ్ అంటే భయ పడే పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. లేఆఫ్స్ పర్వం ఇంకా ఆగినట్లుగా కనిపించడం లేదు. ఇప్పటికే చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులను ఇళ్లకు పంపాయి. మెటా సంస్థ కూడా గతేడాది 11 వేల మందిని ఫైర్ చేసింది. ఇప్పుడు రెండో దఫా లేఆఫ్స్ కి కూడా మెటా సంస్థ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఆర్థికమాంద్యం, ఖర్చులు పెరగడం కారణం ఏదైనా.. సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో ఉద్యోగానికి గ్యారెంటీ లేకుండా పోయింది. ఇప్పిటకే టెక్ దిగ్గజాలు వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపారు. ఆ లిస్టులో మెటా కూడా ఉంది. గతేడాది నవంబర్ లో మెటా సంస్థ ఒకేసారి ఏకంగా 11 వేల మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడానికి, రాబోయే అనర్థాలను ఎదుర్కోవడానికే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతూనే ఉన్నారు. అయితే ఈ లేఆఫ్స్ పర్వం ముగిసిందని అంతా భావిస్తున్నారు. కానీ, మెటా సంస్థ రెండో దఫా లేఆఫ్స్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అదికూడా వచ్చే వారంలోనే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
మెటా సంస్థ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియని వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ఫేస్ బుక్– ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ అంటూ మెటా సంస్థకు చెందిన సోషల్ మీడియా మాధ్యమాలను కోట్లమంది వినియోగిస్తున్నారు. ఎంతో గొప్ప ఆదరణ ఉన్న మెటా సంస్థ కూడా ఉద్యోగాలు తొలగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఒకేసారి 11 వేలమందిని తొలగించిన ఈ సంస్థ మరోసారి లేఆఫ్స్ కి సిద్ధమవుతోందనే వార్తలు ఉద్యోగులను భాయందోళనకు గురి చేస్తున్నాయి. అవసరం లేని టీమ్ లు అన్నింటిని తగ్గించుకోవాలని ఆ సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే రెండో దఫాలో కూడా వేల మంది ఉద్యోగులు ఇంటి బాట పట్టక తప్పదని సమాచారం.
వచ్చే వారంలో ఉద్యోగులకు సంస్థ తరఫున సమాచారం అందే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. మెటా సంస్థ ఖర్చులు భారీగా తగ్గించుకోవాలని చూస్తోంది. ఈ మధ్యకాలంలో మెటాకి కమర్షియల్స్ ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయింది. ఈ కారణంతో ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం చాలా కష్టంగా మారింది. ఇంక ఖర్చులు తగ్గించుకోక తప్పదని భావిస్తున్నారు. అయితే వర్చువల్ రియాలిటీ వేదికైన మెటావర్స్ లో మాత్రం మెటా భారీగా పెట్టుబడులు పెడుతోంది. కాకపోతే దీని ద్వారా వారికి ఆదాయం వచ్చేందుకు చాలా సమయమే పడుతుంది. ప్రస్తుతం రీసెర్చ్, డెవలెప్మెంట్ పై బాగా ఖర్చు చేస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించడం ఎంత వరకు కరెక్ట్? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.