ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. టెక్ దిగ్గజాలు, కంపెనీలు సైతం అన్నీ ఈ ఏఐ టెక్నాలజీ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా ఈ కోవలోకి మెటా సంస్థ కూడా చేరింది.
అన్ని టెక్ దిగ్గజ కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ మీదే పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ నుంచి చాట్ జీపీటీ, గూగుల్ కంపెనీ నుంచి గూగుల్ బార్డ్ వంటి లాంగ్వేజ్ మాడ్యూల్ చాట్ బాట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు మెటా సంస్థ కూడా ఈ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పై ఫోకస్ పెట్టింది. అతి త్వరలోనే వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లోకి ఈ ఏఐ టెక్నాలజీ బేస్డ్ టూల్స్ ని తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ఈ టెక్నాలజీపై ఓ ఎఫక్టివ్ బృందాన్ని తయారు చేస్తున్నట్లు జుకర్ బర్గ్ ప్రకటించారు.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పైనే అన్ని టెక్ కంపెనీలు ఫోకస్ పెట్టాయి. “ఈ ఏఐ టెక్నాలజీకి సంబంధించి మెటా సంస్థలో ఉన్న అన్ని టీమ్స్ నుంచి నిపుణులను ఒక బృందంగా ఏర్పాటు చేస్తున్నాం. ఒక అద్భుతమైన ఏఐ టెక్నాలజీ బేస్డ్ ప్రొడక్ట్ ని తయారు చేయబోతున్నాం. దీర్ఘకాలంలో ప్రజలకు వివిధ రకాలుగా ఉపయోగపడే ఏఐ టూల్స్ తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతానికి మాత్రం వాట్సాప్- ఇన్ స్టాగ్రామ్, మెసెంజర్ లో చాట్, ఇమేజెస్, వీడియో వంటి మల్టీ మోడల్ ఎక్స్ పీరియన్సెస్ మీద ఏఐ టెక్నాలజీని డెవలప్ చేయబోతున్నాం” అంటూ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు.
ఈ కొత్త టీమ్ మెటా సంస్థ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ ఓక్స్ కు రిపోర్ట్ చేయాలని జుకర్ బర్గ్ తెలిపినట్లు.. ఆ సంస్థ అధికారి ప్రతనిధి ఒకరు వెల్లడించారు. అయితే ఏఐ టెక్నాలజీపై టెక్ దిగ్గజాలు ఈ విధంగా ఆసక్తి చూపడం, పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఖర్చు తగ్గించుకోవాలి, ధరలను అదుపు చేయాలి, వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోవాలి అంటూ టెక్ కంపెనీలు ఉద్యోగాలు తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఇలాంటి మాటలు చెబుతూ.. మరోవైపు ఏఐ టెక్నాలజీపై కోట్లలో పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు అంటూ మాజీ ఉద్యోగులు నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్– ఇన్ స్టాగ్రామ్ లోకి ఏఐ టెక్నాలజీ వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.