కారు కొనాలి అనేది చాలా మందికి ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. కొందరు ఆ డ్రీమ్ తీర్చుకోవాలి అనే కంగారులో ఏ కారు పడితే ఆ కారు కొనేస్తుంటారు. ఆ తర్వాత వారి అవసరాలకు అది పనికి రావడం లేదంటూ ఇబ్బంది పడుతూ ఉంటారు.
కారు అనేది ఇప్పుడు ప్రధాన రవాణా సదుపాయంగా మారిపోవడం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు అంటే కారుని విలాస వస్తువుగా చూసేవాళ్లు. ఇప్పుడు సిటీల్లో నలుగురు ఉండే కుటుంబానికి కారు అవసరంగా మారిపోయింది. అందుకే చాలా మంది ఇప్పుడు కార్లు కొనుగోలు చేయడం ప్రారంభించారు. వారి ఆర్థిక స్థోమతకు తగినట్లుగా కొత్త కారు, సెంకడ్స్ అంటూ కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలా మందికి కొన్ని విషయాలు తెలియవు. తెలిసినవాళ్లు, ఇంటి పక్కవాళ్లు, బంధువులు చెప్పారని కారు కొనేస్తుంటారు. ఆ తర్వాత వారి అవసరాలకు అది సెట్ కాక ఎందుకు కొన్నామా అని బాధ పడుతుంటారు. అయితే మీకు ఎలాంటి కారు కావాలో ఒకసారి చూడండి.
చాలా మందికి కారు అని మాత్రమే తెలుసు. కానీ, కార్లలో చాలా రకాలు ఉంటాయి. హ్యాట్చ్ బ్యాక్, సెడాన్, ఎస్‌యూవీ, ఎంయూవీ, కూప్, కన్వర్టబుల్, పికప్ ట్రక్ అంటూ రకాలు ఉంటాయి. హ్యాట్చ్ బ్యాక్ అంటే డిక్కీకి కారు క్యాబిన్ కి కనెక్షన్ ఉంటుంది. లుక్స్ పరంగా కూడా ఎంతో బాగుంటుంది. 4+1 ఎంతో కంఫర్టబుల్ గా జర్నీ చేయచ్చు. కానీ, ఇందులో బూట్ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ లగేజ్ ఉండేవారికి ఇది అంతగా సెట్ కాదు. అలాగే సెడాన్ అంటే బాడీ పరంగా కాస్త పెద్దగానే ఉంటుంది. డిక్కీకి కారుకి ఎలాంటి సంబంధం ఉండదు. క్యాబిన్ సెపరేట్ గా ఉంటుంది. ఫ్రంట్ సీట్లలోనే కాదు.. రేర్ సీట్లలో కూడా ఎంతో కంఫర్ట్ గా కూర్చోవచ్చు. పైగా ఇందులో డిక్కీ ఎంతో పెద్దగా వస్తుంది.
ఇంక ఎస్‌యూవీ(స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్) అంటే.. ఇది ఆకారంలో చాలా పెద్దగా ఉంటుంది. వీటిని స్పోర్ట్స్ కార్స్ కూడా అంటారు. వీటిని సాధారణ వాహనంగా అవసరమైతే ఆఫ్ రోడ్ వెహికల్ గా కూడా వాడుకోవచ్చు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. డ్రైవ్ చేసే వ్యక్తికి రోడ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ కారు సాధారణ కార్లకంటే ఎత్తుగా ఉంటుంది. చాలా స్పేస్ కూడా ఉంటుంది. ఇంక ఎంయూవీ(మల్టీ యుటిలిటీ వెహికిల్) గురించి కూడా తెలుసుకోవాలి. ఇది చాలా పెద్దగా ఉండే కారు. వీటిని ఎక్కువ మంది ప్రయాణం చేసేందుకు.. ఎక్కువ దూరం ప్రయాణం చేసేందుకు వాడుతుంటారు. ఈ కారులో కాస్త స్పేస్ ఎక్కువగా, కంఫర్ట్ గా ఉంటుంది. అయితే వీటి ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.
కార్లలో ఫ్యూయల్ పరంగా, ట్రాన్సిషన్ పరంగా రకాలు ఉంటాయి. అంటే డీజిల్, పెట్రోల్, ఈవీ అని వేరియంట్ర్స్ ఉంటాయి. అలాగే ఆటోమేటిక్, మాన్యువల్ అనే వేరియంట్స్ ఉంటాయి. మీ అవసరాలు, మీ డ్రైవింగ్ స్కిల్స్ ని బట్టి వీటిని ఎంచుకోవాలి. తరచూ కారు తీస్తూ ఉండేవారికి డీజిల్ కారు ఉపయోగంగా ఉంటుంది. కానీ, ఎప్పుడో ఒకసారి కారు బయటకు తీసేవాళ్లు కచ్చితంగా పెట్రోల్ వేరియంట్ తీసుకోవాలి. ఎందుకంటే డీజిల్ కారుని తరచూ వాడకపోతే ఇంజిన్ లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇంక ఈవీ అంటే ప్రస్తుతానికి అయితే సిటీలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఎందుకంటే హైవేలపై మీద ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ రాకపోతే వాటిలో దూర ప్రాంతాలకు వెళ్లలేరు.
అలాగే డ్రైవింగ్ నేర్చుకునే వారికి ఎప్పుడైనా మాన్యువల్ బాగుంటుంది. మీరు మొదటే ఆటోమేటిక్ నేర్చుకుంటే ఇంక మాన్యువల్ కారుని తోలలేరు. అంతేకాకుండా ఆటోమేటిక్ కంటే మాన్యువల్ కారుకే ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఉదాహరణకు బైక్ కి 60 కిలోమీటర్ల మైలేజ్ వస్తే.. స్కూటీకి కేవలం 40 మాత్రమే వస్తుంది. అలాగే గేర్లు ఉన్న కార్లకు 23 కిలోమీటర్ల మైలేజ్ వస్తే.. ఆటోమేటిక్ కారుకి 15 కిలోమీటర్ల కంటే తక్కువ మైలేజ్ వస్తుంది. అంతేకాకుండా ధరల పరంగానూ మాన్యువల్ కారు కంటే ఆటోమేటిక్ కార్లు ఖరీదుగా ఉంటాయి. అందుకే డ్రైవింగ్ కి అంత కంఫర్ట్ గా లేకపోయినా.. ఎక్కువ మంది మాన్యువల్ కార్లనే కొనుగోలు చేస్తుంటారు.
మీరు నలుగురు వ్యక్తులు ఉండి ఎప్పుడో ఒకసారి లాంగ్ ట్రిప్ కి వెళ్లే వాళ్లు అయితే హ్యాట్య్ బ్యాక్ కొనచ్చు. ఉండేది నలుగురు వ్యక్తులే అయినా.. తరచూ టూర్లు వెళ్లడం, లగేజ్ ఎక్కువగా ఉంటే మాత్రం సెడాన్ కొనుక్కోవడం మంచిది. ఐదుగురు వ్యక్తులు ఉంటూ లాంగ్ టూర్లు, ఆఫ్ రోడ్ అండ్వెంచర్స్, లగేజ్ ఎక్కువగా ఉండే పనైతే ఎస్ యూవీ కొనుక్కోవచ్చు. ఇంక ఏడుగురు వ్యక్తులు తరచూ టూర్లు వెళ్లాలి, లగేజ్ బాగా ఉంటుంది అంటే ఎంయూవీ కొనుక్కోవాలి. మీ వాడకాన్ని బట్టి పెట్రోల్, డీజిల్ ని ఎంచుకోవాలి. తక్కువ బడ్జెట్ లో ఎస్యూవీ, ఎంవీయూలు కొనాలి అంటే ట్రస్టెడ్ సెకండ్ హ్యాండ్ కార్ సెల్లర్ ని కలవండి.
తరచూ లాంగ్ డ్రైవ్ వెళ్లే వాళ్లు డీజిల్ కారు కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే పెట్రోల్ అయితే మీకు ఆయిల్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అన్ని అవసరాలు, వివరాలను పక్కన పెడితే కొందరికి ఒక డ్రీమ్ కారు ఉంటుంది. అది కొనాలి అనుకుంటారు. అలాంటప్పుడు ఈ ప్రణాళికలు ఏమీ పనిచేయవు. ఎప్పుడైనా ఒక కారు కొనాలి అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. నలుగురి సలహా తీసుకోండి. మీ బడ్జెట్ కి తగినది మాత్రమే కాదు.. మీ అవసరానికి పనికొచ్చేది తీసుకోండి. అవసరం అనుకుంటే కొన్నాళ్లు వెయిట్ చేయండి. కంగారులో ఏ కారు పడితే ఆ కారు కొనేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సెంకడ్స్ లో అయితే మంచి కండిషన్ లో ఉందని నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు చేయండి.