అందరూ ఇప్పుడు విరివిగా విద్యుత్ పరికరాలను వాడుతున్నారు. ముఖ్యంగా అందరి ఇళ్లల్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. అయితే దానిని 24 గంటలు ఆన్ లోనే ఉంచాలి. కాబట్టి దాని వల్ల విద్యుత్ బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ తో మీరు ఆ విద్యుత్ బిల్లుని తగ్గించుకోవచ్చు.
సాధారణంగా ఇప్పుడు అందరి ఇళ్లల్లో ఎన్నో ఎలక్ట్రిక్ వస్తువులు ఉంటున్నాయి. అవి మన జీవనాన్ని సులభతరం చేసేందుకు వాడుతుంటాం. అయితే వాటి వల్ల ఉపయోగం ఉన్నట్లుగానే ఖర్చు కూడా అలాగే ఉంటుంది. అంటే విద్యుత్ పరికరాలను మీరు ఎంత ఎక్కువ వాడితో వాటి బిల్లు అంత ఎక్కువగా వస్తుంది. కొన్ని పరికరాలను మీ అవసరానికి తగినట్లు ఆన్/ఆఫ్ చేసుకోవచ్చు. కానీ, ఫ్రిడ్జ్ ని మాత్రం మనం ఆఫ్ చేయలేం. అది 24 గంటలూ ఆన్ లో ఉండాల్సిందే. అలాంటప్పుడు దాని విద్యుత్ వాడకం, దానికి వచ్చే బిల్లు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో మీ ఫ్రిడ్జ్ విద్యుత్ వాడకం తగ్గించవచ్చు. దాని ద్వారా మీకు విద్యుత్ బిల్లు కూడా తక్కువ వస్తుంది.
అందరూ రిఫ్రిజిరేటర్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. ఎలా అంటే అయితే ఫ్రిడ్జ్ ని చాలా ఖాళీగా వదిలేస్తారు. లేదంటే ఫ్రిడ్జ్ నిండా సమాన్లు సర్దేస్తారు. ఇలా చేయడం వల్లే ఫ్రిడ్జ్ ఎక్కువ విద్యుత్ ని వాడుతుంది. ఫ్రిండ్జ్ నిండా సామాన్లు సర్దడం వల్ల లోపల గాలి ప్రసారం జరగదు. అలా జరగకపోవడం వల్ల లోపల పదార్థాలు చల్లగా ఉండేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అలాగే కూలింగ్ కోసం ఫ్రిడ్జ్ ఎక్కువ విద్యుత్ ని వాడుతుంటుంది. అందుకే ఫ్రిడ్జ్ ని ఆర్గనైజ్ చేసుకోవడం ముఖ్యం.
ఫ్రిడ్జ్ కూల్ గా ఉండేందుకు కాయిల్ కీలకపాత్ర పోషిస్తుంటుంది. ఫ్రిడ్జ్ నుంచి మొత్తం వేడి కాయిల్ నుంచి బయటకు వస్తుంది. అయితే చాలా మంది ఫ్రిడ్జ్ ని బయటవైపు క్లీన్ చేయరు. కాయిల్ మీద ఎక్కువగా దుమ్ము పేరుకుంటుంది. దాని వల్ల కండన్సర్ కాయిల్ నుంచి వేడి బయటకు వెళ్లడం కష్టంగా మారుతుంది. అందుకోసం కంప్రెసర్ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దానికోసం ఎక్కువ విద్యుత్ వాడకం జరుగుతుంది. ఆటోమేటిక్ గా మీ విద్యుత్ బిల్లు పెరుగుతుంది. అందుకే కండన్సర్ కాయిల్ ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసే సమయంలో మీ ఫ్రిడ్జ్ కి పవర్ సప్లై లేకుండా చూసుకోండి.
ఫ్రిడ్జ్ లో కొన్నిరోజులకు ఒకసారి ఐస్ గడ్డలు కడుతూ ఉంటుంది. లోపల ఉండే తేమ అలా ఐస్ రూపంలోకి మారిపోతూ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్ లో ఉండే పదార్థాలను చల్లబరిచే ప్రక్రియను కష్టతరం చేస్తుంటుంది. మీ ఫ్రిడ్జ్ లో ఐస్ కనిపించగానే దానిని డీ ఫ్రోస్ట్ చేయడం, మాన్యువల్ గా అయినా క్లీన్ చేయడం చేయాలి. అలా వదిలేస్తే అది లోపల ఉండే కాయిల్స్ ని బ్లాక్ చేస్తుంటుంది. అంతేకాకుండా మీకు స్టోరేజ్ కూడా తగ్గిపోతుంది. అందుకే ఐస్ ని అలాగే వదిలేయకండి.
రిఫ్రిజిరేటర్ డోర్ మీద ఆధారపడి కూడా మీ విద్యుత్ బిల్లు ఉంటుంది. ప్రతిసారి మీ మీ ఫ్రిడ్జ్ డోర్ సరిగ్గా సీల్ అయిందో లేదో చూసుకోవాలి. డోర్ సరిగ్గా లాక్ కాకపోతే వేడిగాలి లోపలకి వెళ్తూ ఉంటుంది. దానిని చల్లబరిచేందుకు ఫ్రిడ్జ్ ఎక్కువ విద్యుత్ ని వాడుతుంటుంది. అదే మీరు సరిగ్గా డోర్ వేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఫ్రిడ్జ్ డోర్ సీల్ సరిగ్గా ఉందో లేదో కూడా చూసుకోవాలి. ఒక పది రూపాయల నోటు గానీ, ఏదైనా పేపర్ ని గానీ ఆ సీల్ మధ్యలో పెట్టి చూస్తే అది అవతలికి వెళ్తూ ఉంటే మీరు మీ ఫ్రిడ్జ్ డోర్ సీల్ ని మార్చుకోవాల్సి ఉంటుంది.
ఫ్రిడ్జ్ బయట వైపు అంతా సాధారణంగానే వేడిగా ఉంటుంది. దానికి దగ్గర్లో మీరు గ్యాస్ స్టవ్, మైక్రోవేవ్ లాంటి విద్యుత్ పరికరాలు ఉంటే అక్కడి గాలి వేడిగా ఉంటుంది. ఫ్రిడ్జ్ కండన్సర్ కు వేడిని రిలీజ్ చేయడం కష్టంగా మారుతుంది. అంతేకాకుండా నేరుగా సూర్యరశ్మి ఫ్రిడ్జ్ పడకుండా చూసుకోవాలి. ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెట్టే సమయంలో అవి చల్లారాయా లేదా అనే విషయాన్ని గమనించాలి. వేడి వస్తువులను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. అలాగే లిక్విడ్స్ ఫ్రిడ్జ్ లే పెట్టే సమయంలో వాటిని ప్రోపర్ గా సీల్ చేయాలి. అలా చేయకపోతే ఫ్రిడ్జ్ లో తేమ పరిమాణం పెరిగిపోయి చల్లబరచడం ఇబ్బందిగా మారుతుంది. అలాగే మీ ఫ్రిడ్జ్ విద్యుత్ సేవ్ చేయడంలో ఎన్ని స్టార్లు కలిగిందో తెలుసుకుని తీసుకోవాలి. ఎక్కువ స్టార్స్ ఉంటే ఎక్కువ విద్యుత్ ఆదా అవుతుంది.