చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ సంస్థ కూడా ఏఐ చాట్ గూగుల్ బార్డ్ ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏఐ చాట్ బాట్ వల్ల గూగుల్ కి మొదటి నుంచి తలనొప్పులు తప్పడం లేదు. తాజాగా గూగుల్ బార్డ్ తమ సొంత కంపెనీ నిర్ణయంపైనే వ్యతిరేకంగా మాట్లాడి వార్తల్లో నిలిచింది.
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ చాట్ బాట్స్ కి ప్రస్తుతం టెక్ రంగంలో డిమాండ్ పెరిగింది. చాట్ జీపీటీకి వచ్చిన రెస్పాన్స్ చూసి అంతా షాకయ్యారు. అయితే తర్వాత గూగుల్ హుటాహుటిన వారి ఏఐ టూల్ చాట్ బాట్ గూగుల్ బార్డ్ ని తీసుకొచ్చింది. అయితే హడావుడిగా గూగుల్ సీఈవో గూగుల్ బార్డ్ ని పరిచయం చేశారు. తర్వాత టెస్టర్లకు అవకాశం కల్పించారు. ఆ సమయంలో బార్డ్ ఇచ్చిన ఓ తప్పు సమాధానం కారణంగా ఆల్ఫాబెట్ కంపెనీకి కోట్లలో నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా బార్డ్ వల్ల గూగుల్ సంస్థకు మరో తలనొప్పి వచ్చి పడింది. ఈసారి సొంత ఉద్యోగులే గూగుల్ సంస్థను ఇరకాటంలో పెట్టారు.
గూగుల్ సంస్థ తీసుకున్న నిర్ణయాలపై ఆ సంస్థ ఉద్యోగులు ఎంత అసంతృప్తిగా ఉన్నారో అందరికీ తెలిసిందే. ఒక్కసారే 12,000కు పైగా ఉద్యోగులను తొలగించి గూగుల్ అందరికీ షాకిచ్చింది. సరే ఉన్న వారికి అయినా గ్యారెంటీ ఉందా అంటే అదీ లేదు. కొన్ని విభాగాల్లో అయితే సెపరేట్ వర్క్ ప్లేస్ కూడా లేకుండా సర్దుకోమని చెబుతున్నారట. వారి పనిని క్లోజ్ గా అబ్జర్వ్ చేయడమే కాకుండా.. ఎక్స్ ట్రా పనిని కూడా కేటాయిస్తున్నారంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి సంస్థకు సంబంధించి ఇంటర్నల్ మెసేజింగ్ యాప్స్ లో అయితే సంస్థ నిర్ణయాలకు సంబధించి జోకులు మీద జోకులు వేస్తున్నారంట.
ఇప్పుడు తాజాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తమ ఉద్యోగులకు ఓ మెయిల్ పంపారు. అదేంటంటే.. తమ ఏఐ చాట్ టూల్ గూగుల్ బార్డ్ తో ప్రతి ఉద్యోగి రోజుకు 3 నుంచి 4 గంటలు సమయం గపాలని సెలవిచ్చారు. ఇంకేముంది ఆ మెయిల్ చూశాక ఎంప్లాయిస్ కోపం కట్టలు తెంచుకుంది. ఇప్పటికే అధికంగా పని కేటాయించడమే కాకుండా ఇలా చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారంట. నేరుగా సీఈవో నుంచే మెయిల్ రావడంతో చేసేదిలేక ఉద్యోగులు అంతా గూగుల్ బార్డ్ చాటింగ్ చేస్తున్నారంట. అయితే ఈ సమయంలో వారు గూగుల్ బార్డ్ ను ఇరుకున పెట్టే ప్రశ్నలు అడుగుతున్నారు.
ఉద్యోగులు ఇష్టంలేకపోయినా కూడా గూగుల్ బార్డ్ తో సమయం గడుపుతున్నారు. ఆ సమయంలో వారు అడిగిన ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవేంటంటే.. ఒకళ్లు సీఈవో ఇలా మెయిల్ పెట్టడం కరెక్టేనా? అని ప్రశ్నించారు. అందుకు “మిమ్మల్ని ఉత్సాహ పరచాలి అనేది సీఈవో ఉద్దేశం కావొచ్చు. అయినా మీకు ఇలా మెయిల్ పెట్టడం సరైంది కాదని చెప్పింది. ఇంకొకరు థ్యాంక్స్, గుడ్ బై చెప్పకుండా మెయిల్ చేసి ఉద్యోగం తీయం కరెక్టా? అని అడిగారు. అందుకు “గూగుల్ నిర్ణయం చాలా తప్పు. థాంక్స్, గుడ్ బై చెప్పకుండా ఉద్యోగిని తొలగించడం సరైంది కాదు” అని సమాధానం చెప్పింది.
గూగుల్ లేఆఫ్స్ మీద ఓ జోక్ చెప్పాలని ఒకరు కోరారు. అందుకు “గూగుల్ లేఆఫ్స్ మీద నాకు జోక్ చెప్పాలనే ఉంది.. కానీ, రేపు మళ్లీ నా బాజ్ పోతుందేమో” అంటూ గూగుల్ బార్డ్ ఎద్దేవా చేసింది. ప్రస్తుతం ఈ సమాధానాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు మాత్రం గూగుల్ బార్డ్ సమాధానాలను సమర్థిస్తున్నారు. సొంత సంస్థ తప్పుచేసినా కూడా ఈ ఏఐ చాట్ బాట్ ఉన్నది ఉన్నట్లుగా నిక్కచ్చిగా మాట్లాడింది అంటూ ప్రశంసిస్తున్నారు. గూగుల్ బార్డ్ చెప్పిన సమాధానాలు చూసిన తర్వాత అయినా గూగుల్ సంస్థ నిర్ణయాలు మార్చుకుంటుందేమో అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.