ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీ అనే పేరు బాగా వినిపిస్తోంది. దీనికి కేవలం 5 రోజుల్లోనే 1 మిలియన్ యూజర్లను సంపాదించుకుంది. ఈ ఫీట్ సాధించడానికి పెద్ద పెద్ద కంపెనీలుగా చెప్పుకుంటున్న ఎన్నో సంస్థలకు సంవత్సరంపైగా సమయం పట్టింది. అలాంటి ఐదురోజుల్లో పది లక్షల మంది యూజర్లను సంపాదించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అసలు ఈ చాట్ జీపీటీ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? అనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. అలాగే దానికి ఎందుకు అంత క్రేజ్ అని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మరి.. అసలు చాట్ జీపీటీ అంటే ఏంటో పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం.
జాట్ జీపీటీ గురించి తెలుసుకునే ముందు మీరు చాట్ బాట్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే చాట్ బాట్ కి అప్ డేట్ వర్షన్ లాగానే ఈ చాట్ జీపీటీ ఉంటుంది. చాట్ బాట్ తో మీరు ఎప్పుడో ఒకసారి అయినా సంభాషించే ఉంటారు. దాదాపు అన్ని ప్రముఖ సంస్థలు ఈ చాట్ బాట్ లను వాడుతున్నాయి. వాట్సాప్ లో కూడా మీరు ఈ చాట్ బాట్ లని చూసుంటారు. మీరు మెసేజ్ చేస్తే ఆటేమేటిక్ రిప్లై ఇస్తూ ఉంటుంది. దీనిలో కొన్ని సమాధానాలు లోడ్ చేసుంటాయి. వాటి సాయంతో కంప్యూటర్ మీతో చాట్ చేస్తుంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే చాట్ జీపీటీ దీనికి కాస్త బెటర్ వర్షన్ అనమాట.
చాట్ జీపీటీ అంటే ‘జెనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ ఫార్మర్’ అంటారు. ఇది దగ్గర దగ్గరగా గూగుల్ ని పోలి ఉంటుంది. గూగుల్ లో ఎలా అయితే మీరు ఒక విషయం గురించి వెతుకుతారో అలాగే ఈ చాట్ జీపీటీలో కూడా సెర్చ్ చేయవచ్చు. ఇది ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. దీనిలో 2021కి ముందు జరిగిన అన్ని విషయాలను నిక్షిప్త పరిచారు. మీరు 2021కి ముందు విషయాల్లో ఏ ప్రశ్న అడిగినా కూడా మీకు సమాధానం ఇస్తుంది. ప్రస్తుతం దీని క్రేజ్ చూసి గూగుల్ లాంటి సంస్థలు కూడా వణికిపోతున్నాయి. నవంబర్ 30 2022లో ఈ చాట్ జీపీటీని ప్రారంభించారు. మొదట దీనిని ఫ్రీ సర్వీస్ గానే ప్రారంభించారు. డిసెంబర్ లో దీనిని పెయిడ్ సర్వీస్ గా మార్చాలని చూశారు. కానీ, ఇప్పటికీ పబ్లిక్ కి ఇది ఫ్రీగానే అందుబాటులో ఉంది.
చాట్ జీపీటీ కూడా గూగుల్ తరహాలోనే సెర్చ్ ఇంజిన్ గా ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు గూగుల్ నే వాడచ్చు కదా? కొత్తగా ఈ చాట్ జీపీటీ దేనికి అనే ప్రశ్న రావచ్చు. అవును.. చాట్ జీపీటీ గూగుల్ తరహాలోనే ఉంటుంది. వీటి మధ్య ప్రధానమైన తేడా ఒకటి ఉంది. అదేంటంటే.. మీరు గూగుల్ ఏదైనా ప్రశ్నను అడిగితే దానికి వందల, వేల కొద్ది లింక్స్ వస్తాయి. వాటిలో మీకు ఏది కావాలో మీరే వెతుక్కోవాలి. కానీ, చాటా జీపీటీలో మీరు ఒక ప్రశ్న అడిగితే అది స్ట్రైట్ ఆన్సర్ చెప్తుంది. మీకు లింక్స్ ఇవ్వడం, వెతుక్కోమనడం ఉండదు. అందుకే ఈ చాట్ జీపీటీకి యూజర్లు బాగా ఆకర్షితులవుతున్నారు. దీనికి ఇప్పటికే 20 లక్షలకుపైగా యూజర్లు ఉన్నారు.
మీరు గూగుల్ లో OPENAI.COMలోకి వెళ్లాలి. మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వాలి. అకౌంట్ లేని పక్షంలో మీరు ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. అందుకు మీ గూగుల్, మైక్రోసాఫ్ట్ అకౌంట్లతో లాగిన్ అవ్వచ్చు. తర్వాత మీకు ఒక సెర్చ్ బార్ కనిపిస్తుంది. దానిలో మీకు కావాల్సిన ప్రశ్నను టైప్ చేస్తే మీకు సమాధానం వస్తుంది. అది కూడా సూటిగా సుత్తి లేకుండా అనమాట. ఇలా నేరుగా సమాధానాలు వస్తున్నాయి కాబట్టే చాలా మంది ఈ చాట్ జీపీటీని తెగ ఇష్టపడుతున్నారు. కాకపోతే దీనిలో మీరు 2021కి ముందు జరిగిన విషయాలను మాత్రమే అడగాలి. 2021 తర్వాత జరిగిన అంశాలను అడిగితే సరైన సమాధానం చెప్పదు.
ఈ చాట్ జీపీటీ ద్వారా చాలా లాభాలే ఉన్నాయి. దీనిని ప్రస్తుతం సాఫ్ట్ వేర్ వాళ్లు కూడా బాగా ఉపయోగిస్తున్నారు. ఇది కష్టమైన కోడ్స్ కి కూడా సులువుగా సమాధానం చూపిస్తోంది. మీకు ఏ కోడ్ కావాలో టైప్ చేస్తే అది పూర్తి కోడ్ ని రాసేసి మీకు ఇస్తుంది. అలాగే చదువులకు సంబంధించి ఏ ప్రశ్న అడిగినా మీకు సమాధానం చెబుతుంది. దీంతో మీరు వంట కూడా చేసుకోవచ్చు. మీరు మునక్కాడ సాంబార్ తయారీ విధానం అని కొడితే దానికి కావాల్సిన పదార్థాల నుంచి తయారీ విధానం దాకా అంతా మీకు చూపిస్తుంది. అలా మీ ప్రశ్నలకు దీనిలో సమాధానం వెతుక్కోవచ్చు. మీ ప్రశ్నకు సరైన సమాధానం, సింగిల్ సమాధానం దొరుకుతుంది.
దీని ద్వారా నష్టాలు కూడా లేకపోలేదు. దీనిని ఉపయోగించి విద్యార్థులు తమ చదువులను పాడు చేసుకునే అవకాశం ఉంది. దీనిలో మీకు సబ్జెక్ట్ కి సంబంధించి అయినా ప్రశ్న అడిగితే నేరుగా సమాధానం వస్తుంది. దీనిని కాపీయింగ్ కి ఉపయోగించే ప్రమాదం ఉంది. ఉద్యోగులు కూడా తాము చేయాల్సిన పనులకు తేలిగ్గా సొల్యూషన్ పొందవచ్చు. దీనివల్ల క్రియేటివిటీ దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే దీనిలో ఇంకా చాలా మార్పులు చేయాల్సి ఉంది. మొదట్లో అయితే గన్ ఎలా తయారు చేయాలో కూడా చూపించేసింది.
తర్వాత దీనిని అప్ డేట్ చేశారు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అది చెప్పకూడని ప్రశ్న అంటూ సమాధానం చెబుతోంది. ఇది ఇంటర్నెట్ సహాయం లేకుండానే సమాధానాలు చెబుతుంది. ఇంటర్నెట్ అనుసంధానం లేకపోవడం కూడా ఒక మైనస్ గా చెప్పచ్చు. 2022లో చనిపోయిన వ్యక్తి గురించి అడిగితే అతను ఇంకా బతికే ఉన్నాడని చెబుతుంది. ఇలాంటివి యూజర్లను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్ టూ డేట్ ఉంటే మంచిది.
ఈ చాట్ జీపీటీ ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఒక సంచలనం అనే చెప్పాలి. దీని తరహాలో ఒక సర్వీస్ ను గూగుల్ కూడా ప్రారంభిచాలని చూస్తున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇంటర్నెట్ సాయంతో పనిచేసేలా దీనిని అప్ డేట్ చేస్తే మాత్రం ఫ్యూచర్ మొత్తం చాట్ జీపీటీదే అనడంలో సందేహం లేదు. అయితే ప్రస్తుతం దీని సర్వర్లు అప్పుడప్పుడు మొరయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు చాట్ జీపీటీ అని వెతుకుతుంటే ప్రస్తుతం అందుబాటులో లేదని చెబుతోంది. ఒకవేళ సర్వర్ ఇష్యూ ఉన్నా కూడా అతి త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకొస్తారని చెబుతున్నారు.