మొబైల్ ఇప్పుడు ఇది మనిషి జీవితంలో అత్యవసర వస్తువుగా మారిపోయింది. కొందరికైతే ఇది శరీరంలో ఒక భాగంగా కూడా మారిపోయింది. కొందరికైతే మొబైల్ అనేది జీవనోపాధిని కల్పించే సాధనంగా మారిపోయింది. అయితే ఈ మొబైల్‌కి ఒక సిమ్ కార్డు, దానికి ఒక మంథ్లీ ప్లాన్, నెట్‌వర్క్, టాక్ టైమ్, ఎస్‌ఎమ్మెస్ ఇలా చాలా కావాలి. అందుకు వివిధ నెట్‌వర్కులు వివిధ ఆఫర్లను, ప్యాకేజీలను, ధరలను అందుబాటులో ఉంచాయి. వాటిని బట్టి మీ ప్రీపెయిడ్ సిమ్ కార్డుని రీఛార్జ్ చేసుకోవాలి. ఆ వ్యాలిడీటీ ఉన్నన్ని రోజులు ఆ ప్లాన్ బెనిఫిట్స్ ని మీరు ఎంజాయ్ చేయచ్చు. గడువు సమయం ముగియగానే మళ్లీ రీఛార్జ్ చేయాల్సిందే. అది నెలా, రెండు నెలలా, మూడు నెలలా అనేది మీరు ఎంచుకునే ప్లాన్‌ని బట్టి ఉంటుంది.
నెట్‌వర్క్, సిమ్ మారితే ప్లాన్ మారుతుంది. కానీ, ఒకటి మాత్రం అన్నింటికి కామన్‌గా ఉంది. అదేంటంటే.. ప్లాన్ వ్యాలిడిటీ అనమాట. గత కొద్దిరోజులుగా అన్ని టెలికాం నెట్‌వర్కులు రీఛార్డ్ ప్లాన్ వ్యాలిడిటీని 28 రోజులు, 56 రోజులు, 84 రోజులుగా ఫిక్స్ చేశాయి. ఎవరూ కూడా 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ను అందుబాటులో ఉంచలేదు. వినియోగదారులు కూడా ఆ ప్లాన్స్ కే అలవాటు పడిపోయారు. రిఛార్జ్ అయిపోగానే మళ్లీ రీఛార్జ్ చేసుకుంటున్నారు గానీ, అసలు ఎందుకు అలా వ్యాలిడిటీ ఇస్తున్నారు అనేది ఆలోచించడం లేదు. వారికి వేరే నెట్‌వర్క్ కి మారినా ఫలితం ఉండదు. ఎందుకంటే అందరూ అదే వ్యాలిడిటీ ప్లాన్స్ ని అందిస్తున్నారు. ఈ విషయంపై ట్రాయ్ కూడా ఫుల్ సీరియస్ అయ్యింది. 30 రోజుల ప్లాన్స్ తీసుకురావాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.
అయితే అలా 28, 56, 84 వ్యాలిడిటీ ప్లాన్స్ తీసుకురావడం వెనకున్న అసలు కథ ఏంటంటే.. నిజానికి 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్స్ ఇస్తే వినియోగదారులు సంవత్సరానికి 12 సార్లు రీఛార్జ్ చేసుకుంటే చాలు. కానీ, ఇలా 28, 56, 84 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్స్ వస్తే వినియోగదారులు సంవత్సరానికి 13సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయం మీదనే ట్రాయ్ కూడా సీరియస్ అయ్యింది. తిరిగి 30 రోజుల ప్లాన్స్ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాతే నెల రోజులు వ్యాలిడిటీతో జియో రూ.259 ప్లాన్‌ను ప్రవేశ పెట్టింది. ఆ దారిలోనే వీఐ, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు కూడా అన్నీ ప్లాన్స్ ని మార్చకపోయినా కొన్నింటిని మాత్రం వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే టెలికాం సంస్థల మాస్టర్ ప్లాన్ తెలిసిన తర్వాత వినియోగదారులు నోరెళ్లబెట్టక మానరు.