రైతులకు ట్రాక్టర్ తో చాలా అవసరం ఉంటుంది. వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా దుక్కి దున్నడానికి ట్రాక్టర్ ని వినియోగిస్తారు. అందరి రైతుల దగ్గర సొంతంగా ట్రాక్టర్ ఉండదు. ఊళ్ళో పెద్ద రైతులకు తప్ప చిన్న రైతులకు ఉండదు. దీంతో ట్రాక్టర్ ను అద్దెకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. తెలిసిన వాళ్ళ ట్రాక్టర్ అయితే తక్కువ డబ్బులకు ఇచ్చినా.. డ్రైవర్లు దొరకడం కష్టం. డిమాండ్ ఎక్కువ కాబట్టి ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు. ఆయిల్ రైతు కొట్టిస్తే.. డ్రైవర్ కి గంటకు ఇంత అని ఛార్జ్ చేస్తాడు. గంటలో అయ్యే పనిని గంటన్నర చేయాలని చూస్తాడు. ఎందుకంటే డ్రైవర్ బతకాలి కదా. రైతులకేమో భారం అవుతుంది. అవసరం మనది కదా అని కొంతమంది డ్రైవర్లు తమకు నచ్చినట్టు పని చేస్తారు. అవసరం తనది కాబట్టి రైతు అణిగిమణిగి ఉండాల్సి వస్తుంది.
కొన్ని సందర్భాల్లో డ్రైవర్లతో రైతులకు గొడవ కూడా అవుతుంది. ఇలాంటి సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ‘డ్రైవర్ రహిత ట్రాక్టర్ సాంకేతికత’. ఈ సాంకేతికతను వాడుకుని.. మొబైల్ ఫోన్ తో డ్రైవర్ లేకపోయినా దర్జాగా కాలు మీద కాలేసుకుని ట్రాక్టర్ తో పొలం పనులు చేసుకోవచ్చు. మొబైల్ సాయంతో ట్రాక్టర్ ను డ్రైవర్ లేకపోయినా నడపవచ్చు. డ్రైవర్ లేకపోయినా స్టీరింగ్ దానికదే తిరుగుతుంది. గేర్లు వాటంతటవే మారతాయి. ట్రాక్టర్ ను వెనక్కి, ముందుకి నచ్చినట్టు నడుపుకోవచ్చు. ఈ పరిజ్ఞానాన్ని వరంగల్ కిట్స్ కళాశాల ప్రొఫెసర్ నరసింహారెడ్డి ఆవిష్కరించారు. దీనికి డ్రైవర్ రహిత ట్రాక్టర్ అని పేరు పెట్టారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం కింద 2020 ఫిబ్రవరిలో రూ. 41 లక్షలు ఈ ప్రాజెక్టు కోసం మంజూరు చేసింది.
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డాక్టర్ నిరంజన్ రెడ్డి కో-ప్రిన్సిపల్ ఇన్వెస్టర్ గా, అసిస్టెంట్ ప్రొఫెసర్ షర్ఫుద్దీన్ వసీమ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టర్ గా, ప్రొఫెసర్ నరసింహారెడ్డి ప్రాజెక్ట్ మెంటర్ గా వ్యవహరించారు. బీటెక్ సీఎస్ఈ ఫైనల్ ఇయర్ విద్యార్ధి సాకేత్ ఈ ప్రాజెక్టులో పాలు పంచుకున్నాడు. మూడేళ్ళ పాటు శ్రమించి ఈ డ్రైవర్ రహిత ట్రాక్టర్ ను విజయవంతం చేశారు. ట్రాక్టర్ కు మైక్రో కంట్రోలర్ అమర్చి.. క్లచ్, బ్రేక్, ఎక్స్ లేటర్ ఆపరేట్ చేసేలా మూడు యాక్చువేటర్ లను అమర్చారు. ఇక స్టీరింగ్ ని కంట్రోల్ చేయడానికి ఒక మోటార్ ను అమర్చారు. యాక్చువేటర్ దీన్ని మొబైల్ తో ఆపరేట్ చేసేలా రూపొందించారు. ఐవోటీ పరిజ్ఞానంతో సందేశం క్లౌడ్ కి వెళ్లి.. అక్కడ నుంచి మొబైల్ కు మనం ఇచ్చే ఆదేశాలు వస్తాయి.
ఇంట్లో లేదా వేరే ప్రదేశంలో ఎక్కడ ఉన్నా పొలంలో ట్రాక్టర్ ను మొబైల్ ఫోన్ ద్వారా నడపవచ్చు. 45 హెచ్పీ ట్రాక్టర్ పై ప్రయోగాలు చేయగా అది బాగా నడుస్తోందని ప్రాజెక్టు బృందం తెలిపారు. ఈ సాంకేతికతను రైతులు వాడుకోవాలంటే రూ. 20 వేలు ఖర్చు అవుతుందని వసీమ్ వెల్లడించారు. అయితే ట్రాక్టర్ ఖచ్చితంగా ఉండాలని అన్నారు. ట్రాక్టర్ రెంట్ కి తెచ్చుకుంటే.. డ్రైవర్ ఖర్చులు తగ్గుతాయి. ఒక పది మంది రైతులు 2 వేల చొప్పున వేసుకుని ఈ సాంకేతికతను కొనుగోలు చేస్తే.. డ్రైవర్ కి జీతం ఇచ్చే బాధలు తప్పుతాయి. ట్రాక్టర్ రెంట్, పెట్రోల్ ఖర్చులు ఎలాగూ ఉండేవే కానీ ఈ సాంకేతికతో డ్రైవర్ కి కాస్త ఖర్చుల భారం తగ్గుతుంది కదా. మరి ఈ డ్రైవర్ రహిత ట్రాక్టర్ సాంకేతికతపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.