చాట్ జపీటీ.. ఈ ఏఐ ఆధారిత టెక్నాలజీ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే గత రెండు నెలలుగా టెక్ రంగంలో ఇది ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రారంభమైన కేవలం రెండు నెలల వ్యవధిలోనే 100 మిలియన్ కు పైగా యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకుంది. ఆ రికార్డులు చూస్తే ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ సంస్థలు కూడా బిత్తరపోయాయి. ఈ టెక్నాలజీ అన్ని రంగాలపై ప్రభావం చూపుతుందని అందరికీ అర్థమైంది. దీని ద్వారా మీరు కోడ్ రాయచ్చు, కవితలు చెబుతుంది, జోక్స్ వేస్తుంది. మొదట్లో అయితే బాంబ్ ఎలా తయారు చేయాలో కూడా నేర్పించింది. తర్వాత దానికి కొన్ని పరిధులను నిర్ణయించారు. ఇప్పుడు ఈ సాంకేతికత విషయంలో కొత్త అనుమానాలను లేవనెత్తుతున్నారు.
చాట్ జీపీటీ అనే ఏఐ బేస్‌డ్ చాట్ బాట్ ద్వారా చాలా లాభాలు ఉన్నాయని అందరికీ అర్థమైంది. అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. దీని వల్ల ఐటీ ఉద్యోగాలు పోతాయని అంతా భావిస్తున్నారు. అలాగే పిల్లల చదువుపై కూడా చాలా పెద్ద ప్రభావం చూపుతుందని అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా చాట్ జీపీటీ వల్ల మరింత ముప్పు వాటిల్లనుందని టెక్ నిపుణులు గగ్గోలు పెడుతోంది. అదేంటంటే దీనివల్ల సైబర్ అటాక్స్ జరిగే ఆస్కారం, అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ చాట్ జీపీటీని వినియోగించి చాలా పకడ్బందీగా సైబర్ అటాక్స్ చేయచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బ్యాక్ బెర్రీ కంపెనీ ఇందుకు సంబంధించి ఒక రిపోర్టును విడుదల చేసింది. రాబోయే ఏడాదికాలంలో చాట్ జీపీటీ వల్ల సైబర్ అటాక్స్ జరిగే అవకాశం ఉందని వాళ్లు ఆరోపిస్తున్నారు. వాళ్ల రిపోర్టుల ప్రకారం.. ఇప్పటికే విదేశాల్లో 71 శాతం మంది ఇతర దేశాల విషయాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం దీనిని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. 53శాతం మంది చాట్ జీపీటీ విషయంలో గట్టిగా నమ్ముతున్నది ఏంటంటే.. దీని సాయంతో హ్యాకర్స్ మరిన్ని సైబర్ అటాక్స్ కి పాల్పడే అవకాశం ఉందని. దీనిద్వారా పకడ్బందీగా సైబర్ అటాక్స్ చేయచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ చాట్ జీపీటీ ద్వారా ఎంతో నమ్మశక్యమైన రీతిలో ఫిషింగ్ ఈమెయిల్స్ పంపచ్చని చెబుతున్నారు.
49 శాతం మంది ఏమంటున్నారంటే.. ఈ చాట్ జీపీటీ ద్వారా కాస్తో కూస్తో పరిజ్ఞానం ఉన్న హ్యాకర్స్.. నిపుణులుగా మారిపోతారని చెబుతున్నారు. బ్లాక్ బెర్రీ సైబర్ సెక్యూరిటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ షిషిర్ సింగ్ మాట్లాడుతూ.. “ఇప్పటికే హ్యాకర్స్ చాట్ జీపీటీని టెస్ట్ చేయడం ప్రారంభించారు. వారు ఇంకో సంవత్సరకాలంలో సైబర్ అటాక్స్ చేయడంలో నిపుణులు అయిపోతారు. ఈ చాట్ జీపీటీ సాయంతో కాస్తో కూస్తో తెలిసిన వాడు కూడా హ్యాకర్ అయిపోయే ప్రమాదం ఉంది. వచ్చే ఏడాదికల్లా దీని సాయంతో సైబర్ అటాక్స్ ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసే ఆస్కారం ఉంది” అంటూ షిషిర్ సింగ్ హెచ్చరించారు.
మరోవైపు చాలా సంస్థలు ఏఐ బేస్‌డ్ సైబర్ సెక్యూరిటీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయని చెబుతున్నారు. ఈ చాట్ జీపీటీ తరహా టెక్నాలజీ ద్వారా వచ్చే ముప్పులను అదే తరహా సైబర్ సెక్యూరిటీతోనే ఎదిరించగలరని చెబుతున్నారు. అందుకే దాదాపు 82 శాతం కంపెనీలు ఈ ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ అభివృద్ధిపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయట. వారిలో 42 శాతం మంది అయితే 2023 ఏడాది చివరికల్లా పెట్టుబడి పెట్టేయాలని చూస్తున్నారని బ్లాక్ బెర్రీ సంస్థ రిపోర్టుల్లో వెల్లడించింది. ఈ చాట్ జీపీటీ వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.