టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ని స్వాధీనం చేసుకున్న దగ్గర నుంచి ఏదో ఒక సంచలన ప్రకటన చేస్తూనే ఉన్నాడు. ట్విట్టర్ కంపెనీ బాధ్యతలు తీసుకుని.. కంపెనీలో ఎంటరవ్వడమే వెరైటీగా వచ్చాడు. బాత్రూం కమోడ్ పట్టుకుని ట్విట్టర్ ఆఫీస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత ట్విట్టర్‌లో కీలక బాధ్యతలు నిర్వహించే విజయ గద్దె, పరాగ్ అగర్వాల్‌ని వెంటనే తొలగించాడు. సగానికి పైగా ఉద్యోగులను తొలగించే ఆలోచనలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ట్విట్టర్ బ్లూ టిక్ సేవలు కొనసాగించాలంటే.. నెలకు కొంత మొత్తాన్ని కట్టాలంటూ కొత్త రూల్స్ తీసుకు వచ్చాడు. ఇలా వరుస నిర్ణయాలతో అటు ఉద్యోగులను, ఇటు యూజర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మస్క్.. మరో బాంబు పేల్చేదుకు రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అదేంటంటే.. ఇక మీదట ట్విట్టర్ వాడే వారంతా డబ్బులు చెల్లించాల్సిందేనట. ట్విట్టర్‌లో కొనసాగాలన్నా.. కొత్తగా ఖాతా తేరవలన్నా.. ఇక మీదట సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందేనట. త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అంటున్నారు. దీని గురించి మస్క్.. ఇప్పటికే కంపెనీలోని ఉన్నత ఉద్యోగులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి.. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘మస్క్ ఆలోచనల ప్రకారం.. ఇక మీదట ట్విట్టర్ వినియోగం ఫ్రీ కాదు. నెలకు కేవలం కొన్ని గంటల వరకు మాత్రమే ట్విటర్‌ని ఫ్రీగా వాడుకోవచ్చు. ఆ తర్వాత.. కూడా వినియోగించాలంటే.. సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ఈ మేరకు త్వరలోనే అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది’’ అన్నాడు.
అయితే ప్రతి ఒక్కరు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలనే దాని గురించి మస్క్ సీరియస్‌గా ఆలోచిస్తున్నాడో లేదో తెలియదు కానీ.. ఒక వేళ.. ఇది ఆచరణలోకి వస్తే.. మస్క్‌కే దెబ్బ అంటున్నారు నిపుణులు. ఇప్పటికే చాలా మంది యూజర్లు.. ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ఇక ప్రతి ఒక్కరు సబ్‌స్క్రిప్షన్ రుసుము చెల్లించాల్సిందే అంటే.. ట్విట్టర్‌కు గుడ్‌బై చెప్పి.. ఇతర యాప్‌ల బాట పడతారు. ఈ నిర్ణయం మాత్రం మస్క్‌కు భారీ లాస్ ఇస్తుంది అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. మరోసారి మస్క్ యూజర్ల నెత్తిన ఎలాంటి బాంబు వేస్తాడో చూడాలి.