పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ భారీ డిస్కౌంట్‌తో కూడిన సేల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫ్లిప్‌కార్ట్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అమెజాన్ సేల్ ప్రకటించాయి. ఈ సేల్ లో గృహోపరకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. కొన్ని వస్తువులపై 80-90% వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు షాపింగ్ ప్రియులతో పాటు సాధారణ జనం కూడా తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇంతలా డిస్కౌంట్స్ ఇస్తే.. సదరు సంస్థలకు లాభం ఎలా వస్తుంది? అన్న విషయమై కొందరు ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ వార్త.
ఏ ఈ కామర్స్ సంస్థ అయినా.. వ్యాపారికి, వినియోగదారుడికి మధ్య మధ్యవర్తిగా మాత్రమే పని చేస్తాయి. ఇలా పని చేసినందుకుగాను అవి కొంత మొత్తంలో కమీషన్ కూడా పొందుతాయి. అంటే.. వ్యాపారుస్తులకు తమ ప్లాట్‌ఫాంలను ఓ వేదికగా అందించి.. ప్రొడక్ట్‌లను అమ్ముకునే అవకాశాన్ని కల్పించినందుకుగానూ కమీషన్ పొందుతాయన్నమాట. ఇక్కడ మరొక విషయం.. వ్యాపారులు ఎక్కువగా కష్టమర్ల తాకిడి ఉన్న ప్లాట్‌ఫాంలనే ఎంచుకుంటారు. అందుకే.. ఈ కామర్స్ సంస్థలు భారీ మొత్తంలో డిస్కౌంట్లు ప్రకటించి కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తాయి.
ఇంకా వివరంగా చెప్పాలంటే.. రిలయన్స్ జియో. కొత్తలో జియో.. ఫ్రీగా ఇంటర్నెట్‌ను అందించింది. తీరా ప్రజలందరూ దానికి అలవాటు పడిన తర్వాత.. జేబులు గుల్ల అయ్యేలా టారీఫ్ రేట్లు పెంచేసింది. ఇదే స్ట్రాటజీని ఈకామర్స్ సంస్థలు అమలు చేస్తున్నాయన్నమాట. ఇక్కడ డిస్కౌంట్స్ పేరుతో ప్రజలను దృష్టిని ఆకర్శించడం కోసం వ్యాపారులు ఇచ్చే కమీషన్ లాభాలను వదులుకుంటున్నాయి.
సేల్ ఆఫర్లను సరిగ్గా గమనిస్తే.. ప్రతి విభాగంలోని వస్తువులపై ఈ కామర్స్ సంస్థలు 80-90% డిస్కౌంట్లు ఇవ్వవు. కేవలం కొన్ని వస్తువులపై మాత్రమే ఆ డిస్కౌంట్లు ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే.. 80-90% డిస్కౌంట్లు ప్రకటించే ముందు.. సంబంధిత వస్తువుల రేట్లను పెంచేసి.. తిరిగి ఆ పెంచిన ధరతోపాటు ఇంకొంత మొత్తాన్ని తగ్గించి పెద్ద మొత్తంలో డిస్కౌంట్లు ఇస్తున్నాయనుకునేలా చేస్తాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. సాధారణంగానే కొన్ని కంపెనీలు.. ఏడాది చివర్లో భారీగా మిగిలిపోయిన ప్రొడక్ట్‌లను క్లియరెన్స్ సేల్స్ పేరుతో డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. ఇలా డిస్కౌంట్లలో వచ్చిన ప్రొడక్ట్‌లను వ్యాపారులు పెద్ద మొత్తంలో రిటైల్ ధరలో 20-30% కొనుగోలు చేస్తారు. వాటినే ఈ-కామర్స్ సంస్థల ద్వారా పెద్ద మొత్తంలో డిస్కౌంట్లకు అమ్ముతూ.. ఎక్కువ లాభాలు చూసుకోకుండా కస్టమర్లకు అమ్మేస్తుంటారు.
ఇక్కడ మీకో ఒక సందేహం రావొచ్చు.. ప్రస్తుతం లేటెస్ట్ ఐఫోన్‌ల పైనా రెండు సంస్థలూ భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి కదా.. అవి స్టాక్ ప్రొడక్ట్‌లు ఎలా అవుతాయనే ఆలోచనలు మీ మదిలో మెలుగుతూ ఉండొచ్చు. మీ ఆలోచన నిజమే. అయితే ఇక్కడ జియో సూత్రం పని చేస్తుంది. అదీకాకుండా.. ఐఫోన్‌లపై అంతపెద్ద మొత్తంలో డిస్కౌంట్లు ఇస్తూ సేల్స్ ముగిసే వరకు ఈకామర్స్ సంస్థలు అదే రేటుకు అమ్మవు. సేల్స్ మధ్యలోనే సాధారణంగా ఔటాఫ్ స్టాక్ బోర్డులు పెట్టేస్తుంటాయి. కానీ, ఆఫర్ ఉంటది అన్న నమ్మకంతో వచ్చిన కస్టమర్ కు అక్కడ ఆఫర్ కనిపించదు. నాలుగు వేలు ఎక్కువుంటది. అయినా కొనాలనుకునే కస్టమర్ వెనుకడుగు వేయదు. నాలుగు వేలేగా ఎక్కువ.. ఏముందిలే అన్నట్లుగా కొనేస్తుంటారు. ఇలా ఏదో విధంగా ఈ-కామర్స్ సంస్థలు లాభాలను గడిస్తుంటాయి. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.