కరోనా సమయంలో ఓటీటీలకు ఎక్కువ ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎంటర్ టైన్మెంట్ కోసం ప్రేక్షకులు అంతా ఓటీటీలను ఆశ్రయించారు. తర్వాత సినిమా థియేటర్లు ప్రారంభం అయ్యాయి. కొత్త కొత్త సినిమాలు విడుదల జరుగుతోంది. కానీ, ఇంకా ప్రేక్షకుల ఓటీటీ అలవాటు పోలేదు. ఇప్పటికే చాలా ఓటీటీలు ఉన్నాయి.. కొత్తవి కూడా పుట్టుకొస్తున్నాయి. వీటికి ఏడాది చందా కట్టేసి ఎంచక్కా సినిమాలు చూస్తున్నారు. అయితే ఇక్కడ మిత్రులతో కలిసి ఓటీటీ ఖాతాలను తీసుకుని పాస్ వర్డ్ షేర్ చేస్తూ సినిమాలు చూస్తుంటారు. ఇలా పాస్ వర్డ్ షేరింగ్ వల్ల ఓటీటీలకు చాలా ఎక్కువ నష్టం వస్తోంది. అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ పాస్ వర్డ్ షేరింగ్ కి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు ప్రారంభించింది.
సాధారణంగా ఓటీటీల్లో నెట్ ఫ్లిక్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లను తీసుకొస్తూ సబ్ స్క్రైబర్స్ ని ఆకట్టుకుంటూ ఉంటారు. గతంలో తెలుగు సినిమాలపై అంతగా శ్రద్ధ పెట్టని ఈ సంస్థ ఇప్పుడు తెలుగు సినిమాలను కూడా ఎక్కువగా స్ట్రీమ్ చేస్తోంది. కానీ పెరుగుతున్న పోటీ, ఈ పాస్ వర్డ్ షేరింగ్ కారణంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ చాలా నష్టపోతోంది. పాస్ వర్డ్ షేరింగ్ ను కట్టడి చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఇక నుంచి నెట్ ఫ్లిక్స్ పాస్ వర్డ్ షేర్ చేయడం కుదరదని చెప్పింది. అలా చేస్తే అదనంగా చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. అయితే మీరు పాస్ వర్డ్ షేర్ చేసిన విషయం నెట్ ఫ్లిక్స్ ఎలా తెలుసుకుంటుంది అనే ప్రశ్న వినిపిస్తోంది.
యూజర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం నెట్ ఫ్లిక్స్ తన వెబ్ సైట్ ద్వారా వెల్లడించింది. ఎవరైతే నెట్ ఫ్లిక్స్ ఖాతా తీసుకుంటారో వాళ్లు, వారి ఇంటి సభ్యులు మాత్రమే ఆ ఖాతాను యాక్సెస్ చేయగలరు. వేరే ప్రాంతంలో ఉండేవాళ్లు ఆ ఖాతాను వాడాలి అంటే అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వ్యక్తి కాకుండా వేరేచోట ఉన్న వ్యక్తి ఖాతాను యాక్సెస్ చేయాలి అంటే ఒక ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఖాతాదారుని ఫోన్ నంబర్ కు వచ్చిన పాస్ వర్డ్ ని 15 నిమిషాలలోపే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అది కేవలం వారంరోజులు మాత్రమే పనిచేస్తుంది. అంటే వేరేచోట ఉన్న ఓటీపీ ఎంటర్ చేసి కేవలం వారం మాత్రమే ఆ అకౌంట్ ని యాక్సెస్ చేయగలరు.
అయితే వారంకోసారి ఓటీపీ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకోకండి. ఎందుకంటే ఇక్కడే నెట్ ఫ్లిక్స్ ఒక మెలిక పెట్టింది. వేరే ప్రాంతంలో ఉండే ఆ వ్యక్తి నెట్ ఫ్లిక్స్ అకౌంట్ యాక్సెస్ చేయాలి అంటే.. 31 రోజుల్లోపు ఒక్కసారైనా వైఫై నెట్ వర్క్ ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తేనే వేరే ప్రాంతంలో ఉండే వ్యక్తి ఖాతాదారునికి సంబంధించిన వారిగా గుర్తిస్తుంది. అలా కాకుండా ఉండే మీరు యాక్సెస్ చేసినందుకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వ్యక్తి ఎక్కడికి వెళ్లినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెట్ ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.