హ్యాకింగ్.. ఈ మధ్యకాలంలో ఈ పేరు తరచూ వినిపిస్తోంది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ గ్యాడ్జెట్లు వాడకం పెరిగిపోయిన తర్వాత ఈ హ్యాకింగ్ ఎక్కువైంది. అయితే హ్యాకింగ్ అనగానే అందరికీ ఏదో మాల్ వేర్ మన ఫోన్‌లోకి పంపుతారు. తద్వారా మన ఫోన్ హ్యాక్ చేస్తారని తెలుసు. ఏదైనా తెలియని వాళ్ల నుంచి వచ్చే లింక్స్, అనధికార వెబ్‌సైట్స్ ద్వారా హ్యాకింగ్ జరుగుతుందని ఇప్పటివరకు తెలుసు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే హ్యాకింగ్ గురించి వింటే మీరు నోరెళ్లబెడతారు. అవును.. బ్లూటూత్ ద్వారా హ్యాకింగ్ చేయచ్చు. మీ ఫోన్‌లో బ్లూటూత్ ఆన్‌లో ఉంటే చాలు.. మీ ఫోన్‌ని ఇట్టే హ్యాక్ చేయచ్చు. దానినే బ్లూబగ్గింగ్ అంటారు. దీనిద్వారా మీ వ్యక్తగత సమాచారం మొత్తం బట్టబయలు అయిపోతుంది. అయితే దీనిని ఎలా చేస్తారు? ఎలాంటి నష్టం వాటిల్లుతుంది తెలుసుకుందాం.
బ్లూటూత్ ద్వారా మీ ఫోన్‌ని హ్యాక్ చేయడాన్నే బ్లూ బగ్గింగ్ అంటారు. మీ ఫోన్ బ్లూబగ్గింగ్‌కి గురైన తర్వాత మీ కాల్స్, మెసేజెస్‌కి యాక్సెస్ లభిస్తుంది. మీ ఫోన్ కాంటాక్ట్స్ ని కూడా వాళ్లు దొంగిలిచగలరు. మొదట్లో ఈ బ్లూబగ్గింగ్ ద్వారా ల్యాప్‌ట్యాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లను హ్యాక్ చేసేవాళ్లు. ఇప్పుడు కొత్తగా స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేయడం ప్రారంభించారు. ఇందులో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఇవాళ రేపట్లో అందరూ బ్లూటూత్ ఇయర్ బడ్స్ వాడుతున్నారు. ఆ ఇయర్ బడ్స్ వాడినంతసేపు మీ ఫోన్‌లో బ్లూటూత్ ఆన్‌లోనే ఉంటుంది. ఇప్పుడు బ్లూబగ్గింగ్ చేసేవారికి ఇది చాలా సులభం అయిపోయింది. మీరు ఇయర్ బడ్స్ కోసం బ్లూటూత్ ఆన్ చేసుకుంటే వాళ్లు మీ ఫోన్ హ్యాక్ చేసేందుకు దానిని వాడుకుంటారు.
ఒకసారి బ్లూ బగ్గింగ్ చేసిన తర్వాత మీ ఫోన్‌లో కాల్స్ వినచ్చు, రికార్డు చేయచ్చు. మీ కాల్ డేటా మొత్తం చెక్ చేయచ్చు. మీ ఫోన్ కాంటాక్ట్స్ ని కూడా యాక్సెస్ చేయచ్చు. ఒకసారి మీ ఫోన్ బ్లూటూత్ ద్వారా కనెక్షన్ క్రియేట్ అయితే ఆ తర్వాత మీ సమాచారాన్ని దొంగిలించేందుకు దాడులు చేస్తూనే ఉంటారు. ఈ బ్లూ బగ్గింగ్‌ని నిరోధించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వినియోగంలో లేని బ్లూటూత్ డివైజ్‌లను డిస్‌కనెక్ట్ చేయాలి. బ్యూటూత్‌తో అవసరం లేదు అనుకున్నప్పుడు దానిని ఆఫ్‌లోనే ఉంచాలి. మీ ఫోన్‌ని లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌కి అప్‌డేట్ చేసుకోవాలి. హ్యాక్ అయినట్లు అనుమానం ఉంటే లేటెస్ట్ యాంటీ సాఫ్ట్ వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. పబ్లిక్ వైఫైని ఎక్కువగా వాడకుండా ఉండాలి. ఈ హ్యాక్‌ని నిరోధించడంలో వీపీఎన్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది. దానిద్వారా అదనపు భద్రత లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.