భద్రత నిమిత్తం ఇంటికి సీసీటీవీ కెమెరాల రక్షణ తప్పనిసరి అంటున్న రోజులివి. అందులోనూ చడ్డీ గ్యాంగ్, ఢిల్లీ గ్యాంగ్.. అంటూ దొంగలు కూడా భయపెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్లలో సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవడం మంచి నిర్ణయమే. తద్వారా ఇంటికి, మనకు రక్షణ కల్పించుకోవచ్చు. అయితే, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు అదనపు ఖర్చుతో కూడుకున్నది. ఎంతలేదన్నా.. రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది. దీంతో చాలామంది వీటి ఏర్పాటుకు వెనకడుగు వేస్తుంటారు. అలాంటివారు ఇక చింతించనక్కర్లేదు. మీ పాత ఫోన్‌నే.. మీ ఇంటి సీసీటీవీగా మార్చుకోవచ్చు. ఎలా అన్నది చూద్దాం..
ఇందుకోసం.. రెండు మొబైల్ ఫోన్లు కావాలి. ఒకటి పాత ఫోన్, మరొకటి మీరు ఉపయోగిస్తున్న ఫోన్. ఇందులో పాత ఫోన్‌ను సీసీటీవీ కెమెరాగా, కొత్త ఫోన్‌ను మానిటర్‌గా ఉపయోగించుకోవచ్చు. అలాగే, ఒక యాప్. రెండు ఫోన్లలోనూ సెక్యూరిటీ కెమెరా యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇలాంటి సౌకర్యంతో చాలా యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో గూగుల్ వెరిఫైడ్ యాప్ ఏదేని ఒకటి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారానే మీ పర్యవేక్షణ కొనసాగించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు.. రెండు ఫోన్లలోనూ Alfred CCTV Camera అనే ఒక సెక్యూరిటీ యాప్ డౌన్‌లోడ్ చేశారనుకోండి. దీనికి గూగుల్ ఖాతా ద్వారా సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అయ్యాక.. ఒకదానిలో ‘కెమెరా’, మరొక దానిలో ‘వ్యూవర్’ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అనంతరం మీరు ఫోన్‌ను సీసీటీవీగా ఉపయోగించాలనుకుంటున్న చోట పాత ఫోన్‌ను అమర్చాలి. ఈ ఫోన్‌కు నిరంతరం ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అలాగే, ఫోన్ బ్యాటరీ అయిపోకుండా ఛార్జింగ్ కనెక్ట్ చేయడం, కెమెరాపై దుమ్ము.. ధూళి పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఇంతటితో సెట్టింగ్ పూర్తవుతుంది. ఇప్పుడు ‘వ్యూవర్’ అనే ఆప్షన్ ఎంచుకున్న ఫోన్ ద్వారా మీ ఇంటిని నిరంతరం మానిటర్ చేయవచ్చు. ఈ వార్త మీకు ఉపయోగపడినట్లే అని మీరు భావిస్తే.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.