ఏ టెక్నాలజీ అయినా మనిషి జీవన విధానాన్ని సులభతరం చేయాలనే తయారు చేస్తారు. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ చాట్ బాట్ చాట్ జీపీటీని కూడా అలాగే తయారు చేశారు. కానీ, కొందరు మాత్రం అలాంటి టెక్నాలజీని తప్పుడు దారుల్లో వాడుతున్నారు. అలా వాడిన ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు అంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. వాటిలో మరీ ముఖ్యంగా చాట్ జీపీటీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిచింది. యాక్టివ్ యూజర్లు కూడా చాట్ జీపీటీకి కోట్లలో ఉన్నారు. ఇప్పుడు చాట్ జీపీటీ 4 కూడా విడుదలైన విషయం తెలిసిందే. దీని ద్వారా మీకు కావాల్సిన ఎన్నో విషయాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. పుస్తకాలు, కథలు, కవితలు, కోడింగ్, జోక్స్ ఇలా ఒకటి కాదు ఎలాంటి కంటెంట్ అయినా క్రియేట్ చేయచ్చు. ఇది మీకు పర్సనల్ అసిస్టెంట్ గా కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ చాట్ జీపీటీని తప్పుగా వాడితే మాత్రం ఇబ్బందుల్లో పడక తప్పదు.
సాధారణంగా చాట్ జీపీటీ సాయంతో ఎంతో మంది ఇప్పుడు డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. అంతేకాకుండా ఒక కంటెంట్ రైటర్ గా కూడా చాట్ జీపీటీని వాడుకోవచ్చు. అయితే చాట్ జీపీటీని ఎలా వాడుకుంటున్నాం అనేదే ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే మీరు ఇష్టానికి చాట్ జీపీటీని వాడితే అది మీకే ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అలా ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించి జైలు పాలయ్యాడు. డబ్బుల కోసం తప్పుడు వార్తను సృష్టించాడు. చాట్ జీపీటీ సాయంతో రైలు ప్రమాదంలో 9 మంది మరణించినట్లు ఫేక్ న్యూస్ క్రియేట్ చేశాడు. ఆ వార్తను 15 వేల మంది చూశారు. అలా తప్పుడు వార్తను సర్క్యూలేట్ చేసినందుకు అరెస్టు చేశారు.
ఈ ఘటన చైనాలో జరిగింది. హాంగ్ అనే ఇంటి పేరు గల వ్యక్తి.. బైజియావో అనే బ్లాగ్ కు సంబంధించిన అకౌంట్స్ లో ఈ వార్త పబ్లిష్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతను క్లిక్స్ ద్వారా వచ్చే రెవెన్యూ కోసమే ఇలా చేసినట్లు అంగీకరించాడన్నారు. అయితే ఈ ఘటన చైనాలో జరిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఇలా చాట్ జీపీటీని వినియోగిస్తే మాత్రం కటకటాల పాలు కావడం ఖాయం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించుకోవాలి. ఇలా దుర్వినియోగం చేయకూడదు. పైగా తప్పుడు వార్తల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడం నేరం అవుతుంది. అందుకే చాట్ జీపీటీని సక్రమంగా వాడుకోవాలంటూ టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.