‘పబ్జీ’ ఉంటే చాలు తిండి తిప్పలతో పనిలేదు.. గంటలు, రోజులయినా అదే ఆడుకుంటూ కూర్చునేవాళ్లు. ఎటు వెళ్లినా.. ఏ ఫోన్ చూసినా ‘స్టే అలర్ట్’, ‘ఫామ్ అపోన్ మీ’, ‘ఎనిమీస్ అహెడ్’, ‘ఐ నీడ్ యామో’ ఇవే మాటలు. అంత క్రేజ్ ఉన్న గేమ్ చైనా యాప్స్ బ్యాన్‌కు గురైనప్పుడు భారత్‌లో ఆగిపోయింది. అప్పటి నుంచి అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు. ‘పబ్‌జీ’ ఈజ్ యాన్ ఎమోషన్ అంటూ మీమ్స్ వెల్లువెత్తాయి. ఎలాగైనా తీసుకురండి అంటూ ఆన్‌లైన్ వేదికగా వేడుకున్నారు.
చాలా రోజుల తర్వాత ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’గా పబ్‌జీ తిరిగి భారత్‌లో అడుగుపెట్టింది. రావడానికి నెల ముందు నుంచే ప్లేస్టోర్‌లో అందరూ ప్రీరిజిస్టర్ చేసుకున్నారు. అందరూ ఎదురు చూసినట్లుగానే ప్లేస్టోర్‌లోకి వచ్చేసింది. కానీ, అప్పటి నుంచి మా వర్షన్ ఎప్పుడు వస్తుందంటూ ఐవోఎస్ యూజర్లు బయల్దేరారు. దాదాపు నెలన్నర తర్వాత ఐఫోన్, ఐప్యాడ్ యూజర్ల కోసం బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా యాపిల్ యాప్ స్టోర్‌లోకి వచ్చేసింది.
మరి గేమ్ సపోర్ట్ చేయాలంటే ఏ వర్షన్స్ కావాలి, రిక్వైర్‌మెంట్ల గురించి క్రాఫ్టాన్ సంస్థ తన అఫీషియల్ సపోర్ట్ పేజ్‌లో షేర్ చేసింది. ‘బీజీఎంఐ’ ఆడాలంటే ఐవోఎస్ 9.0, ఆపైన వర్షన్ కావాలి. కనీసం 2 జీబీ ర్యామ్ ఉండాలి. ఐఫోన్‌లో ర్యామ్ వివరాలు తెలియవు కాబట్టి, సింపుల్‌గా చెప్పాలంటే ఐఫోన్ 6S, ఆ తర్వాత రిలీజ్ అయిన ఫోన్లలో ‘బీజీఎంఐ’ ఆడవచ్చు.