సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి సమాచారం అందుకోవడం, చేరవేయడంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగిన క్షణాల్లో స్మార్ట్ ఫోన్ లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే.. ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్ కోసం ఉపయోగించే యాప్ లలో వాట్సాప్ ఒకటి. ఈ వాట్సాప్ లలో గ్రూపులు, ఇంకా ఆ గ్రూపులకు అడ్మిన్స్ కూడా ఉంటారు.
ఒక్కోసారి ఆ గ్రూపులలో ముందు వెనుకా చూసుకోకుండా వచ్చిన వార్తలన్నీ షేర్ చేస్తుంటారు. అందులో దాదాపు ఫేక్ వార్తలే ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇలాంటి ఫేక్ వార్తలను షేర్ చేస్తే ఇకపై గ్రూప్ అడ్మిన్ పై చర్యలు తప్పవని.. అవసరమైతే జైలుకు కూడా వెళ్తాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరి జైలుకి వెళ్లే పరిస్థితి వస్తుందంటే అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం.
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ జాగ్రత్త వహించాల్సిన విషయాలు ఇవేనట:
మీరు వాట్సాప్ ని వాడుతున్నట్లైతే.. వాట్సాప్ గ్రూపుకి ఎవరో ఒకరు అడ్మిన్ ఉంటారని మీకు తెలుసు. ఈ అడ్మిన్ కు కొన్ని బాధ్యతలు ఉంటాయి. గ్రూప్‌లో ఏదైనా చట్టవిరుద్ధమైన, ఫేక్ వార్తలు వస్తే.. వాటిని నియంత్రించడం గ్రూప్ అడ్మిన్ బాధ్యత. లేకపోతే గ్రూప్ అడ్మిన్ కూడా జైలు పాలు కావాల్సి వస్తుందట. ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్‌లలో దేశానికి వ్యతిరేక వార్తలను షేర్ చేయకూడదు.
అదే జరిగితే గ్రూప్ అడ్మిన్ మరియు కంటెంట్ షేర్ చేసే వ్యక్తి ఇద్దరూ అరెస్ట్ చేయబడవచ్చు. వార్తల తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా ఉండవచ్చు. వాట్సాప్ గ్రూపులో హింసను ప్రేరేపించే న్యూస్ పోస్ట్ చేయరాదు. ఏ ఒక్క వర్గాన్ని కించపరిచేలా లేదా హింసను ప్రేరేపించే చిత్రాలను, వార్తలను వాట్సాప్ ద్వారా పోస్ట్ చేయరాదని.. ఒకవేళ అలాంటివి వైరల్ అయితే సంబంధిత వాట్సాప్ అడ్మిన్ ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారని హెచ్చరిస్తుంది పోలీస్ శాఖ.
వాట్సాప్ గ్రూపుల్లో అసభ్యకరమైన అశ్లీలత లేదా వ్యభిచారాన్ని ప్రోత్సహించే వార్తలను వ్యాప్తి చేయడం చట్టవిరుద్ధం. అలాంటి వారిని జైలుకి పంపుతారు. మీరు వాట్సప్ అడ్మిన్ అయితే పై విషయాల్లో జాగ్రత్త వహించండి. మరి ఈ అంశం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.