ప్రస్తుత మానవ ప్రపంచంలో డీజిల్, పెట్రోల్ వాహనాలు సాధారణం. కాలక్రమంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ సమాజం రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా డ్రైవర్ రహిత వాహనాలు ప్రవేశపెట్టడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు ఊహల్లో మాత్రమే ఉన్న ఈ కార్లు ఇప్పుడు వాస్తవరూపం దాల్చనున్నాయి. వీటి తయారీలో ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా, త్వరలో తమంతట తామే నడిచే కార్లను రోడ్లపై చూడబోతున్నాం. వీటి తయారీ వల్ల ప్రపంచంలో మనం ఊహించని రీతిలో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది.ఒక గుండ్రటి గోళానికి నాలుగు చక్రాలు తగిలించి ఉన్నట్లు కనిపిస్తున్న ఈ విచిత్రవాహనం ఆటబొమ్మ కాదు, మానవ ప్రపంచంలోకి రాబోతున్న డ్రైవర్ లెస్ కారు. మనకు తెలిసినంత వరకు ఇప్పిటిదాకా కంప్యూటర్లు, మొబైల్‌ఫోన్లు తయారీకి పరిమితమైన యాపిల్ కంపెనీ తాజాగా రూపొందించిన ఎలక్ట్రిక్ కారు ఇది. అయితే ఇది కాన్సెప్ట్ మాత్రమేనండోయ్. యాపిల్ కంపెనీ కోసం భారత సంతతికి చెందిన మెకానికల్ డిజైనర్ దేవాంగ బోరా ‘యాపిల్ ఆటోనమస్’ పేరిట ఈ గుండ్రటి వాహనానికి రూపకల్పన చేశారు.
తేజ్‌పూర్ యూనివర్శిటీ మెకానికల్ ఇంజనీర్ దేవాంగ బోరా పునాది వేసిన ఈ కాన్సెప్ట్ కి యాపిల్ కంపెనీ రూపాన్ని దిద్దుతుంది. సుమారు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ కంపెనీ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. దీనికి ప్రాజెక్ట్ టైటాన్ అని నామకరణం చేసినట్లు సమాచారం. 2024 నాటికి మార్కెట్లోకి రావచ్చని నివేదికలు చెప్తున్నాయి. ఇది పూర్తిగా డ్రైవర్‌లెస్ వాహనం. ఇందులో ఇద్దరు మనుషులు సౌకర్యవంతంగా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ప్రయాణించేవారిని కోరుకున్న చోట దించేశాక ఈ కారు నిర్దేశిత పార్కింగ్ స్థలానికి తనంటత తానే వెళ్లిపోతుందట. ఈ వాహనాన్ని మరో రెండేళ్లలో మార్కెట్‌లోకి తేవడానికి యాపిల్ సంస్థ సన్నాహాలు చేస్తుందట.