కారు అనగానే పెట్రోల్- డీజిల్ అనే వాళ్లు ఈ మధ్య ఎలక్ట్రిక్ కారు అంటున్నారు. కానీ, సీఎన్జీ ఉంది అని తెలిసినా కూడా ఎవరూ దానిని పరిగణలోకి తీసుకోరు. అయితే అసలు సీఎన్జీ కారు వల్ల ఏంటి ఉపయోగాలు? ఆ కారు కొనుగోలు చేయడం లాభమా? నష్టమా? తెలుసుకుందాం.
కార్లలో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా.. సీఎన్జీ కార్లు కూడా ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ, కారు కొనే సమయంలో చాలా మంది ఈ సీఎన్జీని పరిగణలోకి తీసుకోరు. అందుకు రెండు కారణాలు ఉంటాయి.. ఒకటి సీఎన్జీ సెట్ కాదు అని మీరు అనుకోవడం. రెండు మీకు సీఎన్జీ గురించి సరిగ్గా తెలియకపోవడం. అయితే మీరు గనుక సీఎన్జీ కారుని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? అలా అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే. ముందు ఆ కారు వల్ల కలిగే లాభాలు- నష్టాలు గురించి తెలుసుకోండి. ఆ తర్వాత మీకు సీఎన్జీ కారు సెట్ అవుతుందా? లేదా అనేది డిసైడ్ అవ్వండి.
సాధారణంగా పెట్రోల్ ఎన్నో ఉద్ఘారాలు ఉంటాయి. మెటల్స్, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ అంటూ ఎన్నో కెమికల్స్ ఉంటాయి. వీటి వల్ల మీ ఇంజిన్ ఆయిల్ కూడా కరప్ట్ అవుతుంది. వాటి వల్ల పర్యావరణానికి ఎంత నష్టమో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహనాల వైపు మళ్లుతున్నారు. అయితే సీఎన్జీలో అలాంటి కెమికల్స్ ఏమీ ఉండవు. పర్యావరణానికి కూడా ఎలాంటి హాని చేయదు.
పెట్రోల్, డీజిల్ ట్యాంకులతో పోలిస్తే.. సీఎన్జీ ఎంతో మేలని చెబుతున్నారు. ఈ వాహనాలు పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే.. ఎంతో తక్కువ హీటవుతాయి. ట్యాంక్ డిజైన్ కూడా పెట్రోల్/డీజిల్ వాహనాల కంటే ఎంతో భద్రతగా ఉంటుంది. పైగా ఈ సీఎన్జీ అనేది గాలి కంటే చాలా తక్కువ బరువులో ఉంటుంది. అగ్ని ప్రమాదం కూడా చాలా రేర్ గా జరిగే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగిన సమయంలో కూడా సీఎన్జీ వల్ల పేలుడు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.
పెట్రోల్ ఆక్టేన్ రేటింగ్ 130గా ఉంది. అయితే సీఎన్జీ కార్లు కూడా ఈ విషయంలో ఏ మాత్రం తీసిపోవు. సూపర్ ఆక్టేన్ రేటింగ్ 95గా ఉండగా.. అన్ లీడెడ్ ఆక్టేన్ రేటింగ్ 98గా ఉంది. అంటే సర్టిఫైడ్ గ్యాస్ ఇంజిన్స్ సునాయాసంగా పెట్రోల్ ఇంజిన్లను బీట్ చేయగలవు.
ప్రస్తుతం ఉన్న పెట్రోల్ ధరతో పోలిస్తే సీఎన్జీ తక్కువ ధరకే వస్తుంది. పైగా 100 కిలోమీటర్లు వెళ్లేందుకు 8 లీటర్ల ఆయిల్ ఖర్చు అయితే.. మీకు సీఎన్జీ కేవలం 5.5 కేజీలు మాత్రమే ఖర్చు అవుతుంది. అలా చూసుకుంటే ఫ్యూయల్ ఛార్జెస్ చాలా వరకు తగ్గిపోయినట్లే. మీరు డీజిల్, పెట్రోల్ కారుని కూడా సీఎన్జీకి మార్చుకునే అవకాశం ఉంటుంది.
సీఎన్జీలో ఉండే ప్రధానమైన బలహీనత.. తక్కువ శక్తిని ఉత్పత్తి చేయడం. పెట్రోల్/డీజిల్ తో పోలిస్తే సీఎన్జీ కారు తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా సీఎన్జీ కారు పికప్ కాస్త తక్కువగా ఉంటుంది. వేగంగా కారుని నడపాలి అంటే మీకు సీఎన్జీ బెస్ట్ ఆప్షన్ కాదనే చెప్పాలి.
మీరు సీఎన్జీ కారుని కొనుగోలు చేసినా.. పెట్రోల్/డీజిల్ కారుని సీఎన్జీగా మార్చుకున్నా ఒక మైనస్ ఉంది. అదేంటంటే సీఎన్జీ కార్లకు రీ సేల్ వ్యాల్యూ తక్కువగా ఉంటుంది. ఈ కార్లను కొనుగోలు చేయడం తక్కువ. ఒకవేళ సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేసినా చాలా తక్కువ ధరకు అడుగుతారు.
సాధారణంగా కారులో ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే కచ్చితంగా లగేజ్ పెట్టుకునేందుకు బూట్ స్పేస్ కావాలి. కానీ, సీఎన్జీ వల్ల మీకు ఆ అవకాశం ఉండదు. ఎందుకంటే సీఎన్జీ సిలిడర్లు డిక్కీలోనే ప్లేస్ చేస్తారు. తద్వారా మీకు చాలా తక్కువ బూట్ స్పేస్ మాత్రమే లభిస్తుంది. అలాంటప్పుడు మీరు కారులో నలుగురు ప్రయాణిస్తే లగేజ్ పెట్టుకునే ఆప్షన్ అస్సలు ఉండదు. పైగా సీఎన్జీ రీ ఫిల్లింగ్ కి కూడా కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అది కూడా ఒక మైనస్ గానే చెప్పచ్చు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని మీకు సీఎన్జీ కారు సరిపోతుందో.. లేదో నిర్ణయం తీసుకోవచ్చు.