అన్ని టెక్ కంపెనీలు ఇటీవలి కాలంలో వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఖర్చులను తగ్గించుకునేందుకు, భవిష్యత్ లో గడ్డు పరిస్థితులు రాకుండా ఉండేందుకు లేఆఫ్స్ కి వెళ్తున్నట్లు వెల్లడించాయి. గూగుల్ సంస్థ కూడా దాదాపు 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
ప్రస్తుతం టెక్ కంపెనీల్లో కొంత అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని టెక్ కంపెనీలు వేలల్లో ఉద్యోగులను తొలగించాయి. గూగుల్ సంస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 12 వేల మందిని తొలగించింది. ఆ తర్వాతే గూగుల్ సంస్థలో ఒక ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం వార్తల్లో నిలిచింది. ఉద్యోగాల తొలగింపు వల్లే ఏమైనా ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అని. ఇప్పుడు మరో ఉద్యోగి ఆఫీస్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అసలు ఈ ఉద్యోగి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అందుకు నిజంగానే ఉద్యోగాల తొలగింపు కారణం అయి ఉంటుందా? అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.
న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. చెల్సియాలోని గూగుల్ మెయిన్ ఆఫీస్ భవనం 14వ అంతస్థు నుంచి 31 ఏళ్ల ఉద్యోగి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనాస్థిలికి చేరుకుని పరిశీలించారు. కానీ, ఆ గూగుల్ ఉద్యోగి వివరాలు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అనే విషయాలు వెల్లడించలేదు. అతని కుటుంబసభ్యులకు కూడా సమాచారం అందిచలేదని చెప్పారు. 15 అంతస్థుల భవనంలో 14వ ఫ్లోర్ లో ఓపెన్ ఎయిర్ టెర్రస్ పైనుంచి దూకినట్లు అనుమానించి అక్కడ చెక్ చేయగా.. అతని వేలిముద్రలు దొరికాయి. అక్కడి నుంచే దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు.
ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్న వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భవనంలో గానీ, ఘటనాస్థలంలో గానీ ఎలాంటి సూసైడ్ నోట్, వీడియో లభించలేదు. అతని ఆత్మహత్యకు అసలు కారణం ఏంటో తెలియరాలేదు. ఇటీవలే ఫిబ్రవరిలో 33 ఏళ్ల జేకబ్ ప్రాట్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్టుమెంట్ లో ఉరివేసుకుని అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని లింక్ డిన్ ప్రొఫైల్ ప్రకారం గూగుల్ లో పార్ట్నర్ షిప్ లీడ్ గా పనిచేస్తున్నట్లు ఉంది. అయితే ఈ ఆత్మహత్యలకు కారణం ఏంటి? ఉద్యోగుల తొలగింపు జాబితాలో వారి పేర్లు కూడా ఉన్నాయా? అనే విషయాలపై ఎలాంటి స్పష్టత లేదు.