బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఇంకా రెండ్రోజుల సమయమే ఉంది. దీంతో భారత్, ఆస్ట్రేలియా జట్లు సన్నాహకాల్లో మునిగిపోయాయి. సిరీస్‌ను గెలవడంపై దృష్టి పెట్టాయి. ఈ సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చేదు అనుభవం ఎదురైంది. విరాట్ తన ఫోన్ పోగొట్టుకున్నాడు. అదీ కొత్త మొబైల్ కావడం గమనార్హం. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్‌లో ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ టాప్ బ్యాటర్ ఓ పోస్టు పెట్టాడు. ‘బాక్స్‌లో నుంచి కూడా బయటకు తీయని ఫోన్ పోతే.. దానికంటే బాధాకరమైన ఫీలింగ్ మరొకటి ఉండదు. మీలో నా మొబైల్‌ను ఎవరైనా చూశారా..?’ అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. దీంతో ఇది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.
కోహ్లీ పోస్టుపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. కొందరు ఇదేదో యాడ్ అయి ఉంటుందని అంటున్నారు. మరికొందరు టెస్ట్ సిరీస్‌కు ముందు విరాట్‌పై ఒత్తిడి పెంచొద్దంటూ సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కోహ్లీ ట్వీట్‌పై ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో స్పందించిన తీరు హట్ టాపిక్‌గా మారింది. కోహ్లీ పోస్టుకు.. ‘వదిన గారి మొబైల్ నుంచి ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేసేందుకు మొహమాట పడొద్దు. ఇప్పుడు అదే మీకు చాలా సాయపడుతుంది’ అంటూ జొమాటో కామెంట్ పెట్టింది. ఫోన్ పోయి కోహ్లీ బాధలో ఉంటే ఐస్ క్రీమ్ గోల ఏంట్రా బాబు అని జొమాటోపై కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బాధలో ఉన్న విరాట్‌ను గెలకొద్దని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. మరి, కోహ్లీ పోస్ట్‌కు జొమాటో ఇచ్చిన రిప్లయ్ మీకు ఎలా అనిపించిందనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.
feel free to order ice cream from bhabhi’s phone if that will help 😇
— zomato (@zomato) February 7, 2023