ఈ తరానికి యువరాజ్ అంటే గుర్తుకు వచ్చేది.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు. ఇదంతా అతని జీవితంలో ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే యువీ జీవితంలో మనకు తెలియని ఎన్నో సంఘటనలు ఉన్నాయి. తల్లిదండ్రుల గొడవల కారణంగా తల్లి దగ్గరే పెరగడం.. క్రికెట్ అంటే ఇష్టంలేని యువీ అదే ఆటను ఎంచుకోవడం.. అనంతరం తండ్రి బలవంతంతో తనకు ఇష్టమైన ఆటను వదిలేయడం.. ఆ తరువాత అద్భుతాలు చేయడం.. క్యాన్సర్ మహమ్మరిన పడడం.. దానితో పోరాడి జీవితంలో మళ్లీ ఎదగడం.. ఇలా ఎన్నో దాగున్నాయి. వీటన్నిటి గురుంచి యువీ బయట పెట్టకపోయినా.. సీనియర్లతో తన క్రికెట్ ప్రయాణం ఎలా సాగిందన్నది బయటపెట్టాడు.
ఈ ఏడాది టీమిండియా ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. వరుస ఓటములు ఎదురవుతున్నాయి. అన్నింటా ఓటములే. ఏడాది ఆరంభంలోసౌతాఫ్రికా చేతిలో ఓటమి మొదలుకొని.. ఇటీవల బంగ్లాదేశ్ చేతిలో ఓటమి వరకు అన్ని చేదు సంఘటనలే. టీమిండియా ఏ టోర్నీలో ఓడినా మొదట టార్గెట్ అయ్యేది ఐపీఎల్‌యే. దీన్ని బ్యాన్ చేయాలంటూ గళమెత్తుతారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఐపీఎల్, క్రికెట్ ప్రపంచంలో ఎన్నో మార్పులకు నాంది పలికింది. తాజాగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సైతం ఈ విషయాన్ని అంగీకరించాడు. సీనియర్లతో తన ప్రయాణం ఎలా సాగిందో.. అప్పటి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గురించి బయటపెట్టాడు.
2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన యువరాజ్.. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన జట్టులో సభ్యుడు. అతడు జట్టులోకి అడుగుపెట్టేసరికి.. జట్టులో అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి సీనియర్లు ఉండేవారు. అప్పటివరకు వారిని టీవీల్లోనే చూసిన యువీ, వారితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునేందుకు చాలా భయపడేవాడట. అంటే.. భయం లాంటి గౌరవం. “సీనియర్ల పక్కన కూర్చోవాల్సి వస్తే.. భయపడి కోచ్‌ని అడిగి సీటు మార్చుకునేవాళ్లం. అయితే.. కోచ్‌లు మాత్రం అతను మీ సీనియర్, పక్కన కూర్చోవాల్సిందేనని చెప్పేవాళ్లు. వాళ్లతో మాట్లాడడానికి చాలా రోజులు పట్టేది. సీనియర్ల నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నా చాలా సమయం పట్టింది.. కానీ, ఇప్పుడలా లేదు.
ఐపీఎల్ వల్ల అంతా మారిపోయింది. ఇప్పటి కుర్రాళ్లు, టీమ్‌లోకి రాకముందే సీనియర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకుంటున్నారు. సీనియర్లు అంటే భయపడే వాతావరణం ఉండట్లేదు. కావాల్సింది కూడా ఇదే. సీనియర్లతో ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా.. అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇది ఐపీఎల్ వల్లే సాధ్యమైంది..” అని యువీ ఆచెప్పుకొచ్చాడు. అంటే.. యువీ ఉద్దేశ్యంతో ఐపీఎల్ వల్ల లాభమే తప్ప.. నష్టం లేదని. ఇక భారత క్రికెట్ లో యువరాజ్ సింగ్ ప్రస్థానం అందరకి తెలిసిందే. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్.. ఈ రెండూ అందించడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. ఈ మాజీ ఆల్ రౌండర్ 2019లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.