వరుసగా ఫెయిల్ అవుతున్న స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్‌కు వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ మద్దతుగా నిలిచాడు. స్కైకి మరిన్ని ఛాన్సులు ఇవ్వాలన్నాడు యువీ. ఇంకా ఆయనేం అన్నాడంటే..
వన్డే వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడుతోంది. ఈ మెగా టోర్నీకి మరో ఆరు నెలల టైమ్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో అన్ని జట్లు ఆ దిశగా సన్నాహకాలను మొదలుపెట్టాయి. మిగిలిన టీమ్స్ పరిస్థితి ఎలాగున్నా.. టీమిండియాను మాత్రం పలు సమస్యలు వేధిస్తున్నాయి. ఒకవైపు కీలక ప్లేయర్లకు గాయాలు, మరోవైపు స్టార్ ఆటగాళ్ల ఫామ్‌లేమితో వరల్డ్ కప్ సన్నాహకాల్లో భారత్ కాస్త వెనుకంజలోనే ఉంది. ముఖ్యంగా టీమిండియా బ్యాటర్లు సరిగ్గా రాణించలేకపోతున్నారు. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఇది కొట్టొచ్చినట్లు కనిపించింది. స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ఫామ్ ఆందోళన పరుస్తోంది. ఆసీస్‌తో సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు సూర్య.
వరుసగా ఫెయిల్ అవుతున్న సూర్యను వన్డే టీమ్ నుంచి తప్పించాలని కొందరు మాజీలు, క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. స్కైని టీ20లకే పరిమితం చేయాలని అంటున్నారు. అయితే, సూర్య కుమార్ యాదవ్‌కు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మద్దతుగా నిలిచాడు. వన్డేల్లో సూర్య తప్పక సత్తా చాటుతాడని, మున్ముందు అతడు రాణిస్తాడని యువీ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఆఖర్లో జరిగే 50 ఓవర్ల ప్రపంచ కప్‌లో భారత్‌కు కీలక ఆటగాడిగా సూర్య మారతాడని యువీ చెప్పుకొచ్చాడు. ప్రతి ప్లేయర్ కెరీర్లో ఎత్తుపల్లాలు సాధారణమేనన్నాడు. సూర్యకు మరిన్ని ఛాన్సులు ఇస్తే వన్డే వరల్డ్ కప్‌లో కీలక పాత్ర పోషిస్తాడని యువీ పేర్కొన్నాడు. అతడు మళ్లీ ఫామ్‌ను అందుకుంటాడని ట్వీట్ చేశాడు. మరి.. ఫామ్‌లేమితో బాధపడుతున్న సూర్య మళ్లీ కమ్‌బ్యాక్ ఇస్తాడని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Every sports person goes thru ups & downs in their career! We’ve all experienced it at sum point. I believe @surya_14kumar is a key player for India 🇮🇳 & will play an imp role in the #WorldCup if given the opportunities. Let’s back our players coz our Surya 🌞 will rise again 💯
— Yuvraj Singh (@YUVSTRONG12) March 24, 2023