ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా చేతుల్లో పరాభవంతో రెండేళ్లు పడిన శ్రమ అంతా వృథా అయింది. దీనికి టీమిండియా సెలెక్షన్, ఆటతీరును అందరూ తప్పుబడుతున్నారు.
రెండేళ్ల పాటు కష్టపడి ఆఖరిదాకా వచ్చి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా మరోసారి చేతులెత్తేసింది. మొదటి డబ్ల్యూటీసీ ఫైనల్ మాదిరిగానే ఇంకోసారి తుదిమెట్టుపై విఫలమైంది భారత జట్టు. కీలకమైన టెస్టులో ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకొని మరో ఐసీసీ కప్‌ను చేజార్చుకుంది. కోట్లాది మంది భారత అభిమానుల అంచనాలను వమ్ము చేస్తూ, దారుణ ప్రదర్శనతో కంగారూల చేతుల్లో భారీ ఓటమిని మూటగట్టుకుంది. దీంతో రోహిత్ సేన పెర్ఫార్మెన్స్పై సీనియర్ క్రికెటర్లు సహా ఫ్యాన్స్ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. హిట్‌మ్యాన్ కెప్టెన్సీ, టీమ్‌లో లోటుపాట్లను ఎత్తిచూపుతున్నారు. దిగ్గజ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కూడా భారత జట్టు సెలెక్షన్, ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆసీస్‌తో కీలకమైన టెస్టు కోసం ఇండియన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోకపోవడంపై సచిన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు చేసి ఉంటే పోటీలో ఉండేదన్నాడు సచిన్. ‘తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరు చేసి ఉండాల్సింది. కానీ అలా మాత్రం జరగలేదు. కొన్ని సెషన్లలో ఆసీస్‌కు దీటుగా భారత్ ప్రదర్శన కనబర్చినప్పటికీ.. వరల్డ్‌లోనే నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న అశ్విన్‌ను ఎందుకు తీసుకోలేదో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. పేసర్లకు సహకరించే పిచ్ అని చెప్పి అశ్విన్ టాలెంట్‌ను వాడుకోకపోవడం నాకు అశ్చర్యం కలిగించింది. ప్రతిభ ఉన్న స్పిన్నర్లు ఎప్పుడూ టర్నింగ్ ట్రాక్‌ల మీద ఆధారపడరు. వారు మ్యాచ్ పరిస్థితులను ఉపయోగించుకొని బౌలింగ్‌లో వైవిధ్యాన్ని చూపిస్తారు. ఆస్ట్రేలియా టాప్-8 బ్యాటర్లలో ఐదుగురు లెఫ్టాండర్లు ఉన్నారనే విషయాన్ని మరువకూడదు. అశ్విన్‌ను తీసుకోకపోవడం భారత్‌ను దెబ్బతీసింది’ అని సచిన్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే, రెండేళ్ల డబ్ల్యూటీసీ సైకిల్లో 13 టెస్టుల్లో 61 వికెట్లు తీశాడు అశ్విన్.