మ్యూజిక్ బ్యాండ్ అనగానే మదిలో మగవారే కళ్ళ ముందు కనిపిస్తారు. కానీ ఉత్తరాఖండ్‌కు వెళితే… అక్కడ ఓ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అదే… ‘విమెనియా బ్యాండ్’. ఆ బ్యాండ్ ప్రత్యేకత ఏమిటంటారా? ఈ బ్యాండ్‌లో అంతా మహిళలే! ఇప్పుడీ బ్యాండ్… దేశంలోనే ఓ బ్రాండ్. విమెనియా బ్యాండ్’ గురించి చెప్పాలంటే ఐదేళ్లు వెనక్కి వెళ్లాలి. వుమెన్స్ డే మార్చి 8, 2016 లో స్వాతి సింగ్ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మార్కెటింగ్ విభాగం. మంచి హోదా, జీతం. ఇవేవీ కిక్కు ఇవ్వలేదు ఆమెకు. అంతే, అంత పెద్ద ఉద్యోగాన్నీ వదిలేశారు. తనకు ఎంతో ఇష్టమైన ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న ఆల్ విమెన్ బ్యాండ్ అప్పటికి వుమెన్స్ డే మార్చి 8 ప్రారంభించారు. అదే ‘విమెనియా బ్యాండ్’. స్వాతి సింగ్‌తో పాటు శాకంబరి కొట్నాల, శ్రీవిద్యా కొట్నాల, విజుల్ చౌదరి ఈ గ్రూప్ లో మెంబర్స్. పదహారేళ్ల శ్రీవిద్య – నలభై నాలుగేళ్ల శాకంబరి కుమార్తె కావడం మరో విశేషం. ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్స్ వీళ్ల బ్యాండ్ కి ఫ్యాన్స్ గా మారిపోయారు. స్వాతి సింగ్ కష్టపడి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదిం చుకున్నారు. కానీ సంగీతమంటే ఆమెకు ప్రాణం. మంచి గాయకురాలు. గిటార్ కూడా అద్భుతంగా వాయిస్తారు. కిక్కిరిసిన ప్రేక్షకుల సమక్షంలో ప్రత్యక్షంగా వేదికపై సంగీత ప్రదర్శన ఇవ్వాలనేది ఆమె జీవిత కల. ఆ కల నిజం చేసుకోవడం కోసమే 2007లో టీచర్ ఉద్యోగానికి రిజైన్ చేశారు. తరువాత కొంత కాలం ఓ కార్పొరేట్ కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో చేరారు. దాంతోపాటే తన అభిరుచిని నిజం చేసుకోవడానికి అలుపెరుగని కృషి చేశారు. దాదాపు పదేళ్ల తరువాత ఆమె కల ఫలించింది. అంతా మహిళలతోనే మ్యూజిక్ బ్యాండ్ ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా వీరు ప్రదర్శనలు ఇస్తున్నారు. అందులో కొన్ని గవర్నమెంట్ ఆఫీసులూ ఉండటం విశేషం. మ్యూజిక్ బ్యాండ్ కొనసాగించడం అంత సులువు కాదు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపించాలి. లేదంటే వెనకపడిపోవడం ఖాయం. దానికితోడు ఆ బ్యాండ్‌కంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నారు స్వాతి సింగ్. క్లాసికల్, సూఫీ ఫ్యూజన్స్ ‘విమెనియా బ్యాండ్’ ప్రత్యేకత. వరకట్నం, లైంగిక వేధింపులు, సాధికారత తదితర మహిళలకు సంబంధించిన ఎన్నో సామాజిక అంశాలపైనే వారి పాటలు ఉంటాయి. పాట రచనే కాదు బాణీలు కూడా సొంతంగా సమకూర్చుకొంటుందీ బృందం. బాలీవుడ్ సాంగ్స్ మాత్రమే కాదు స్థానిక ఫోక్స్ సాంగ్స్, గజల్స్ ఇలా అన్ని ప్రక్రియల్లో ఈ ఉమెనియా బ్యాండ్ ముందుంటుంది. దాంతో ఏ ఊళ్ళో, ఏ రాష్ట్రంలో చేసినా అక్కడ వీళ్లకి అద్భుతమైన సత్కారాలు లభిస్తున్నాయి. లేడీస్ ఫలానా పనులే చెయ్యాలని గిరి గీసుకుని కూర్చో కుండా తమదైన స్టైల్లో ముందడుగు వేస్తే విజయం ఖాయం అని వీళ్ళని చూస్తే మీరూ ఒప్పేసుకుంటారు.