గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా తరఫున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని భారత కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి వెల్లడించాడు.
2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ పరాజయం అనంతరం భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ).. ఈ ఫార్మాట్లో యువ ఆటగాళ్లకే ఎక్కువ అవకాశాలు ఇస్తూ వస్తోంది. దీంతో సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 జట్టుకు దాదాపు దూరమైపోయారు. పొట్టి ఫార్మాట్లో హార్దిక్ పాండ్యా జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అయితే వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టెస్టు, వన్డే సిరీస్ లు ఆడిన హిట్ మ్యాన్ కు టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించగా.. ప్రస్తుతం రోహిత్ అమెరికాలో పర్యటిస్తున్నాడు.
ఇందులో భాగంగా యూఎస్ఏలో క్రికెట్ అకాడమీ ప్రారంభించిన రోహిత్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హిట్ మ్యాన్ మాట్లాడుతూ.. 2024 జూన్ లో అమెరికాలో జరిగే టీ20 ప్రపంచకప్ ను ద్రుష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లు వెల్లడించాడు.ఈ ఫార్మాట్లో సీనియర్లను పక్కన పెట్టేలా బీసీసీఐ అడుగులు ముందుకు వేస్తుంటే.. రోహిత్ శర్మ మాత్రం అందుకున్న భిన్నంగా స్పందించాడు. గతేడాది చివరి నుంచి ఒక్క టీ20 మ్యాచ్ లో కూడా రోహిత్ దేశానికి ప్రాతినిధ్యం వహించలేదు. మరోవైపు విరాట్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు.
వీరిద్దరినీ పొట్టి ఫార్మాట్ నుంచి పొమ్మన లేక పొగబెడుతున్నారని విశ్లేషకులు అంచనాలు వేయగా.. తాజా రోహిత్ కామెంట్లు ఆసక్తికర చర్చను లేవనెత్తాయి. ఇప్పటికే 35 ఏళ్లు దాటిపోయిన రోహిత్.. వచ్చే సంవత్సరం జరుగనున్న టీ20 ప్రపంచకప్ గురించి ఆలోచిస్తున్నాడంటే.. ఇక ద్వైపాక్షిక సిరీస్ ల్లో కొత్త ఆటగాళ్లను ప్రయోగించి ఏం లాభం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అమెరికాలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ భారత క్రికెట్ అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు.
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి తిరిగి కోలుకుంటున్నాడని.. త్వరలోనే అతడి బండ పట్టాలెక్కుతుందని వెల్లడించాడు. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్ లో అతడు కీలకమవుతాడనే అంచనాల మధ్య రోహిత్ ఇచ్చిన అప్ డేట్ తో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఇక విండీస్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ఆదివారం గయానా వేదికగా రెండో మ్యాచ్ లో కరీబియన్లతో తలపడనుంది.